పెళ్లిపీటలెక్కనున్న భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్
భారత క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందిన శార్దూల్ ఠాకూర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. వచ్చే యేడాది ఫిబ్రవరి 27వ తేదీన తన చిన్ననాటి స్నేహితురాలైన మిథాలీ పారుల్కర్‌ను వివాహం చేసుకోనున్నారు. నిజానికి వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలో గత నవంబరులో వీరికి నిశ్చితార్థం జరిగింది. తాజాగా వివాహ ముహూర్త తేదీని ఖరారు చేశారు.
వచ్చే యేడాది ఫిబ్రవరి 24వ తేదీ వరకు శార్దుల్ ఠాకూర్ క్రికెట్ సిరీస్‌లతో బిజీగా గడుపనున్నారు. దీంతో 27వ తేదీన ముహూర్తంగా ఖరారు చేశారు. అయితే, వివాహ వేడుకలు మాత్రం 25వ తేదీ నుంచే ప్రారంభమవుతాయని తెలిపారు. ముంబై శివారులోని కర్జత్‌లో మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరుగుతుంది. మోడల్ అయిన మిథాలీ ప్రస్తుతం బేకింగ్ స్టార్టప్‌ను నిర్వహిస్తున్నారు.