శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2019 (10:51 IST)

టీమిండియా సరికొత్త రికార్డు: 202 పరుగుల తేడాతో జయకేతనం

టీమిండియా, విరాట్ కోహ్లీ సేన సరికొత్త రికార్డు నెలకొల్పింది. దక్షిణాఫ్రికాపై జరిగిన మూడు టెస్టుల్లో భారత్ విజయభేరి మోగించింది. మూడో టెస్టులో భాగంగా నాలుగో రోజు మరో రెండు వికెట్ల వేటకు దిగిన టీమిండియా రెండో ఓవర్‌లోనే ఆ రెండు వికెట్లను పడగొట్టింది. మంగళవారం రెండో ఓవర్ వేసిన నదీమ్ వరుస బంతుల్లో బ్రైన్, ఎంగిడిని అవుట్ చేయడంతో టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. 
 
చివరి రెండు వికెట్లను లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్‌ నదీమ్‌ తీయడంతో ఇన్నింగ్స్ 202 పరుగులతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో సఫారీపై ఎప్పుడూలేని విధంగా 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలి రెండు టెస్టుల్లో కొంత ప్రతిఘటన కనబర్చిన సఫారీలు.. ఈ సారి అదీ లేకుండా పూర్తిగా తలొగ్గడంతో భారత్ విజయం నల్లేరుపై నడకగా మారింది.
 
తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌటైన సఫారీలు ఫాలో ఆన్ ఆడి.. 133 పరుగులకే కుప్పకూలారు. కాగా, ఉమేశ్‌, షమి, అశ్విన్‌, జడ్డూ, నదీమ్‌ బంతితో విజృంభించడంతో దక్షిణాఫ్రికా ఒకే రోజున (టెస్టు 3వ రోజు) 16 వికెట్లు చేజార్చుకున్న సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే ఈ టెస్టు సిరీస్‌లో సెంచరీలు, డబుల్ సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు టెస్టులు సాధించడంతో.. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఐదు టెస్టుల్లో 240 పాయింట్లు సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్, శ్రీలంక చెరో 60 పాయింట్లతో రెండు, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి.