ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 జులై 2024 (21:39 IST)

మహిళల ఆసియాకప్ 2024: 8 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు

Women's Asia Cup final
Women's Asia Cup final
మహిళల ఆసియాకప్ 2024 ఆతిథ్య శ్రీలంకతో ఆదివారం జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సమష్టిగా విఫలమైన భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అసాధారణ ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు.. కీలక మ్యాచ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. ఏ విభాగంలోనూ సమిష్ఠిగా రాణించలేకపోయింది. ఫలితంగా ఈ మ్యాచ్‌ను కైవసం చేసుకోలేక.. విఫలమైంది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన(47 బంతుల్లో 10 ఫోర్లతో 60) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. రిచా ఘోష్(14 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30), జెమీమా రోడ్రిగ్స్(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 29) ధాటిగా ఆడారు.
 
షెఫాలీ వర్మ(16), ఉమ చెత్రీ(9), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(11) తీవ్రంగా నిరాశపర్చడంతో భారత్ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. శ్రీలంక బౌలర్లలో కవిషా దిల్ హరి రెండు వికెట్లు తీయగా..సచిని, చమరి ఆటపట్టు, పరబోధని తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 167 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ ఒక వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.