గురువారం, 5 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 10 జులై 2017 (01:02 IST)

మనోళ్లు దుమ్మురేపారు కానీ వాళ్లూ డబుల్ దుమ్ము లేపారు. టీ20లో విండీసే విజేత

భారత్‌తో జరుగుతున్న ఏకైక టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌ ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ అద్భుత శతకం సాధించి ఒంటిచేత్తో విజయం కట్టబెట్టాడు. అసాధ్యమనుకున్న విజయలక్ష్యాన్ని మంచినీళ్ల ప్రాయంలాగా విండీస్ జట్టు ఛేదించడంలో లూయిస్‌దే ప్రధాన పాత్ర. కేవలం 53 బంతుల

భారత్‌తో జరుగుతున్న ఏకైక టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌ ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ అద్భుత శతకం సాధించి ఒంటిచేత్తో విజయం కట్టబెట్టాడు. అసాధ్యమనుకున్న విజయలక్ష్యాన్ని మంచినీళ్ల ప్రాయంలాగా విండీస్ జట్టు ఛేదించడంలో లూయిస్‌దే ప్రధాన పాత్ర.  కేవలం 53 బంతుల్లో 5ఫోర్లు, 9సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన లూయిస్ విండీస్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు.. టీ20ల్లో అతనికి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ఈ రెండు శతకాలను భారత్‌పైనే సాధించాడు. ఆరంభం నుంచి స్వేచ్ఛగా ఆడుతూ వెస్టిండీస్‌ను గెలుపుదిశగా నడిపించిన లూయిస్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. లూయిస్ భీకర బ్యాటింగ్‌తో 18.3 ఓవర్లలో 194 పరుగులు సాధించిన విండీస్ జట్టు టీ20 సీరీస్‌లో తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించింది.
 
కరీబియన్‌ పర్యటనను కోహ్లీసేన పరాజయంతో ముగించింది. వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న ఉత్సాహంతో ఏకైక టీ20లో గెలిచి పర్యటనను ఘనంగా ముగించాలనుకున్న టీమ్‌ఇండియా ఆశ నెరవేరలేదు. విండీస్‌ ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌(125 నాటౌట్‌: 62 బంతుల్లో 6×4, 12×6) మెరుపు శతకంతో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 9 బంతులు మిగిలి ఉండగానే వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 9 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. భారీ టార్గెట్‌ను అలవోకగా ఛేదించి ప్రపంచ టీ20 ఛాంపియన్స్‌ తామేనని కరీబియన్‌ ఆటగాళ్లు మరోసారి నిరూపించారు.
 
లూయిస్‌ బ్యాటింగ్‌ను ఎంత ఘనంగా చెప్పుకున్నప్పటికీ భారీ విజయ లక్ష్యాన్ని విధించి కూడా నిలుపుకోలేకపోయిన భారత్ సెల్ఫ్ గోల్‌ వేసుకుని మరీ మ్యాచ్‌ను విండీస్‌కి అప్పగించిందా అనిపించింది. ఆట మొదట్లోనే రెండు విలువైన వికెట్లను క్యాచ్ రూపంలో చేతులారా విడిచి పెట్టిన టీమిండియా అందుకు భారీ మూల్యాన్నే చెల్లించింది. పైగా స్టంప్ రారాజుగా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ అత్యాశ్చర్యకరంగా రెండు స్టంప్ ఔట్‌లలో విఫలం కావడం గమనార్హం. వీటన్నింటికంటే మించి కోహ్లీ కెప్టెన్సీ క్లిష్ట పరిస్థితుల్లో ఎంత పేలవంగా ఉంటుందో మరోసారి తేటతెల్లమైంది. బౌలర్ ఎవరు అనేది చూడకుండా విండీస్ బ్యాట్స్‌మెన్ బంతుల్ని చితకబాదుతుంటే కేప్టెన్‌తో సహా భారత బౌలర్లు చేష్ట్యలుడిగిపోయారు.
 
క్రిస్ గేల్, మెకల్లమ్ తర్వాత టీ20 మ్యాచ్‌లలో రెండో శతకం సాధించిన లూయిస్ చేజింగ్‌లో 194 పరుగుల లక్ష్యంలో 125 పరుగులతో సునామీ సృష్టించిన ఏకైక బ్యాట్స్‍‌మన్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు. జట్టు స్కోరులో 65 శాతం పరుగులు లూయిస్ ఒక్కడే చేయడమే కాదు వీటిలో  57 శాతం పరుగులు సిక్సుల రూపంలో వచ్చాయి. ఒరే మ్యాచ్‌లో 12 సిక్సులను ఒకే బ్యాట్స్‌మన్ సాధించడం విశేషం.
 
అంతకుముందు వెస్టిండీస్‌తో జరుగుతోన్న ఏకైక టి20లో భారత్ ఆతిధ్య జట్టు ముందు 191 పరుగుల విజయలక్ష్యాన్నుంచింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్‌ను భారత బ్యాట్స్‌మెన్ దీటుగానే ఎదుర్కొన్నారు. కోహ్లీ 22 బంతుల్లో 39 పరుగులు, శిఖర్ ధావన్ 12 బంతుల్లో 23 పరుగులు చేసి అవుటయ్యారు. దినేశ్ కార్తీక్ 29 బంతుల్లో 48 పరుగులు, ధోనీ రెండు, పంత్ 38, జాదవ్ 4 పరుగులు చేసి అవుటయ్యారు. జడేజా 13, అశ్విన్ 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. టేలర్ 2, విలియమ్స్ 2, సామ్యూల్స్ ఒక వికెట్ తీశారు.