వర్షం వల్ల టీమిండియాకు మేలా? చేటా?
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా మాంచెష్టర్ వేదికగా మంగళవారం భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ వర్షం దెబ్బకు అర్థాంతరంగా ఆగిపోయింది. అప్పటికి కివీస్ స్కోరు 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అయితే, వర్షం పుణ్యమాని మ్యాచ్ రెండో రోజుకు వాయిదాపడింది. మంగళవారం కురిసిన వర్షం భారత్‌కు మేలు చేస్తుందా? చేటు చేస్తుందా? అనేది ఇపుడు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న.
బుధవారం కూడా వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా తుడిసిపెట్టుకుని పోతే మాత్రం లీగ్ దశలో కివీస్ కన్నా ఎక్కువ పాయింట్లతో ఉన్న భారతే ఫైనల్ చేరుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు! బుధవారం మధ్య మధ్యలో ఆటకు అంతరాయం కలిగిస్తే భారత్ అవకాశాలపై ప్రభావం పడటం ఖాయం. వర్షం వల్ల మైదాన పరిస్థితులు ఇప్పటికే భారత్‌కు కొంత ప్రతికూలంగా మారి ఉంటాయి. అసలే పిచ్ నెమ్మదిగా ఉండగా.. వర్షం వల్ల పరిస్థితులు బౌలర్లకు మరింత అనుకూలంగా మారొచ్చు.
మంగళవారం పిచ్ ఎలా ఉన్నప్పటికీ.. ఔట్‌ఫీల్డ్ మాత్రం వేగంగానే ఉంది. వర్షం తర్వాత బంతి ఆశించినంత వేగంగా పరుగులు పెట్టకపోవచ్చు. కాబట్టి పూర్తి మ్యాచ్ సాగినా ఛేదన అంత సులువు కాకపోవచ్చు. వర్షం పడకపోయి ఉంటే.. కివీస్ 240 లోపు స్కోరుకు పరిమితమయ్యేదేమో. భారత బ్యాట్స్‌మెన్ ఫామ్ ప్రకారం చూస్తే.. అప్పటి పరిస్థితుల్లో ఛేదన భారత్‌కు అంత కష్టం కాకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వర్షం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయే ఆస్కారం ఉంది.
కివీస్ నిర్దేశించే లక్ష్యం 240 రన్స్ లోపే ఉన్నా.. బౌల్ట్, ఫెర్గూసన్, హెన్రీల బౌలింగ్‌ను ఎదుర్కొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సలుభమైన విషయం కాదు. ముఖ్యంగా ఆరంభ ఓవర్లలో బౌల్ట్ నుంచి ముప్పు తప్పదు. వర్షం లేకుండా మ్యాచ్ మామూలుగా సాగిపోయినా ఫర్వాలేదు. అలాకాకుండా ఆటకు అంతరాయం కలిగించి డక్‌వర్త్-లూయిస్ పద్ధతి అమల్లోకి వస్తే మాత్రం భారత్‌కు ఆందోళన తప్పకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.