గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 21 జనవరి 2022 (09:26 IST)

పెళ్లాడమంటే కాదంటున్నాడు, కోర్కె తీర్చకపోతే వీడియోలు బయటపెడతానంటున్నాడు: యువతి ఫిర్యాదు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై రాజేంద్రప్రసాద్ అనే యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బోయిన్ పల్లి ఠాణా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 
పెద్దపల్లి జిల్లా అందుగుల పల్లికి చెందిన మాదిపల్లి అంజలి(24) గత మూడేళ్లుగా ఓ ప్రైవేట్ కంపెనీలో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తోంది. అయితే నాలుగేళ్ల క్రితం తన అక్క వివాహంలో అంజలికి కరీంనగర్ శంకరం పేట మండలం గద్దె పక్క గ్రామానికి చెందిన ఉకంటి రాజేంద్రప్రసాద్(26)తో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది.

 
ఈ క్రమంలోనే నింధితుడు బాధితురాలిని వివాహం చేసుకుంటానని నమ్మించాడు. దీంతో న్యూ బోయిన్ పల్లి లోని ఓ హోటల్ గదిలో ఇరువురు పలుమార్లు శారీరకంగా ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే నిందితుడు ఫోటోలు, వీడియోలను తీశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తనను వివాహం చేసుకోవాలని అడిగినప్పుడల్లా నిందితుడు దాటవేస్తూ వస్తున్నాడు.

 
గత కొద్ది రోజులుగా పెళ్లి చేసుకోనని, ఒకవేళ ఆమె ఇతరులను ఎవరినైనా వివాహం చేసుకుంటే తన వద్ద ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు గురువారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.