బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (09:27 IST)

ప్రేమించి పెళ్లికి నిరాకరించాడనీ ప్రియుడి ఇంటికి నిప్పంటించిన యువతి

కర్నాటక రాష్ట్రంలో ఓ యువతి ప్రియుడిపై తిరగబడింది. ప్రేమించి పెళ్లికి నిరాకరించడాన్ని ఆ యువతి జీర్ణించుకోలేక పోయింది. దీంతో ఆ ప్రియుడి నడిపే ఆటోతో పాటు అతని ఇంటిపై పెట్రోల్ పోటి నిప్పంటించింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని బసవకళ్యాణ తాలూకా హిప్పరగా గ్రామానికి చెందిన భీమరావు అనే యువకుడు తన తల్లితో కలిసి సస్తాపూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో భీమారావుకు సుమ అనే యువతి పరిచయమై అది ప్రేమగా మారింది. ఫలితంగా గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ వస్తున్నారు. అయితే, తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువతి పదేపదే ఒత్తిడి చేయసాగింది. 
 
దీంతో భీమరావు తన తల్లిని తీసుకుని హిప్పరగా గ్రామానికి మకాం మార్చాడు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ఆ యువతి.. ప్రియుడికి తగిన గుణపాఠం నేర్పాలని భావించింది. ఆ విధంగా అనుకున్నదే తడవుగా తన మనుషులను తీసుకుని భీమరావు ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. అందుకు అతడు నిరాకరించడంతో ఆటోను, అతను నివశించే ఇంటికే నిప్పుపెట్టింది. దీనిపై భీమరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.