మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య
మాంసం తినే విషయంలో ప్రియుడు, ప్రియురాలి మధ్య గొడవ జరిగింది. దీంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు పైలెట్ కావడం గమనార్హం. ఈ విషాదకర ఘటన ముంబై నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాలను పరిశీలిస్తే,
సృష్టి తులి అనే ఓ యువతి పైలెట్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ఆదిత్య పండిట్ అనే వ్యక్తి పరిచయం కాగా, ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమికులుగా మారారు. ఢిల్లీలో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ కోసం శిక్షణ పొందుతున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.
అయితే, ఆదిత్య పండిట్ శాఖాహారి కాగా... సృష్టి తులీకి మాత్రం మాంసాహారం అంటే అమితమైన ఇష్టం. వీరిద్దరూ ముంబైలో కలిసి జీవిస్తున్నారు. ఈ ప్రేమికులు ఇద్దరి మధ్య మాంసాహారం కారణంగా తరచుగా ఘర్షణలు జరిగేవి. ప్రియురాలు నాన్‌వెజ్ తినడాన్ని ఆదిత్య పండిట్ తీవ్రంగా వ్యతిరేకించసాగాడు. ఇదే విషయంపై వారిద్దరూ పలుమార్లు గొడవపడ్డారు.
సోమవారం కూడా వీరిద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ గొడవ అనంతరం, అర్ధరాత్రి వేళ ఆదిత్య పండిట్ ఢిల్లీ బయల్దేరాడు. అయితే, సృష్టి తులి ఫోన్ చేసి తాను చనిపోతానని బెదిరించడంతో, అతడు మళ్లీ ఇంటికి వచ్చాడు. తలుపులు వేసి ఉండడంతో, వాచ్‌మన్ సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా... సృష్టి తులి అచేతనంగా కనిపించింది.
ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. సృష్టి తులి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతుంటే సృష్టి తులి కుటుంబ సభ్యులు మాత్రం అది హత్యేనని అంటున్నారు. ఆదిత్య పండిట్ చంపేశాడని ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రియుడిని అరెస్టు చేశారు.