కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం
జిల్లా కేంద్రమైన అనంతపురంలో విషాదరక ఘటన ఒకటి వెలుగు చూసింది. డిప్యూటీ తాహసీల్దారు భార్య, కుమారుడు అనుమానాస్పదంగా కనిపించారు. కుటుంబ కలహాల కారణంగా తన కొడుకుని చంపి తల్లి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని రామగిరి డిప్యూటీ తాహసీల్దారుగా రవి పని చేస్తుండగా, ఆయన భార్య, కుమారుడు అనుమానాస్పదస్థితిలో కనిపించారు. అనంతపురంలోని శారదా నగర్‌లో కుటుంబంతో ఉంటున్నారు. ఐదేళ్ల క్రితం అమూల్య అనే మహిళతో ఆయనకు వివాహం కాగా, వీరికి మూడున్నరేళ్ల కుమారుడు సహర్ష ఉన్నాడు. గురువారం విధులకు వెళ్లిన రవి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి తలపు తట్టగా ఎంతసేపటికీ తీయలేదు.
దీంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా, లోపల అమూల్య ఉరికి వేలాడుతూ కనిపించింది. మంచంపై కుమారుడు రక్తపు మడుగులో పడివున్నాడు. ఈ దృశ్యం చూసి షాక్‌కు గురైన రవి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలు అమూల్య తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇది ఆత్మహత్యనా లేక హత్యనా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు.