ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 23 జులై 2023 (10:50 IST)

తలపై గరిటతో గట్టిగా కొట్టిన తల్లి.. చిన్నారి మృతి.. ఎక్కడ?

murder
అల్లారుముద్దుగా పెంచుకుంటూ వచ్చిన చిన్నారి తలపై కన్నతల్లి గరిటతో కాస్త గట్టిగా కొట్టింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన ఏపీలోని అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం గాజువాకలో జరిగింది. తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
యలమంచిలికి చెందిన సాయి, గాజువాకలో నివాసం ఉండే బంగారు స్నేహ 2020 జనవరి నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉపాధి నిమిత్తం విజయవాడ వెళ్లిన వారికి 2022 మార్చి నెలలో పాప జన్మించింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య కలహాలు రావడంతో విజయవాడ నుంచి తిరిగొచ్చేశారు. ప్రస్తుతం సాయి యలమంచిలిలో ఉంటుండగా, బంగారు స్నేహ తన కుమార్తెను తీసుకుని గాజువాక వచ్చేసింది. 
 
గత కొద్దికాలం నుంచి సమీప బంధువైన యలమంచిలికి చెందిన రమణబాబుతో సన్నిహితంగా మెలుగుతోంది. ఆమె నెల కింద కూర్మన్నపాలెం సమీప మంగళపాలెంలోని జేఎన్ఎన్ఎయూఆర్ఎం గృహ సముదాయాల్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటోంది. ఈనెల 17న కుమార్తె అల్లరి చేయడంతో గరిటెతో తలపై కొట్టడంతో చిన్నారి స్పృహ కోల్పోయింది. 
 
అరగంట తర్వాత పాప చనిపోయినట్లు గుర్తించిన బంగారు స్నేహ... రమణబాబు సాయంతో ఇంటి వెనుక ప్రాంతంలో గొయ్యి తీసి ఖననం చేశారు. శనివారం బంగారు స్నేహ తండ్రి ఇంటికి వచ్చినప్పుడు గీతశ్రీ కనిపించకపోవడంతో ఆరా తీశారు. ఆర్థిక ఇబ్బందులతో పాపను విక్రయించేశానని బదులివ్వడంతో ఆయన గట్టిగా నిలదీశారు.
 
దీనికితోడు చిన్నారి మృతదేహం నుంచి దుర్వాసన రావడం వీధికుక్కలు గొయ్యిలోంచి బయటకు లాగడంతో వ్యవహారం బయటపడింది. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.... చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. డీసీపీ ఆనందెడ్డి, ఏసీపీ త్రినాథ్ సమీక్షించారు. సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.