నీట్ ర్యాంకు రాలేదని విద్యార్థి ఆత్మహత్య - మరుసటి రోజే తండ్రి సూసైడ్
రెండుసార్లు ప్రయత్నించినా నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని ఓ విద్యార్థి బలన్మరణానికి పాల్పడ్డాడు. చేతికి అందొచ్చిన కుమారుడి మరణవార్త విని, తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి ఆ మరుసటి రోజే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాజధాని చెన్నై పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
జగదీశ్వరన్ అనే విద్యార్థి 2022లో 12వ తరగతి పూర్తి చేశాడు. ఈ క్రమంలో వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌కు శిక్షణ తీసుకున్నాడు. అయితే రెండు ప్రయత్నాల్లో అతడు ఆశించిన ఫలితం పొందలేకపోయాడు. దాంతో మనస్తాపానికి గురైన జగదీశ్వరన్.. శనివారం ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి సెల్వశేఖర్ మరుసటి రోజు ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషాద ఘటనలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు వెళ్లాలని కోరారు. అలాగే కొన్ని నెలల్లో రాజకీయంగా మార్పులు వస్తే.. నీట్ అడ్డంకులు తొలగిపోతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు 'నేను సంతకం చేయను' అనేవారు అదృశ్యమవుతారని గవర్నర్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు.