సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య
భారత సాయుధ దళాల్లోని వేర్వేరు విభాగాల్లో పని చేస్తూ వచ్చిన ఓ జంట... వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మృతుల్లో ఒకరు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేస్తుండగా, మరొకరు ఆర్మీలో కెప్టెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే,
దీన్ దయాళ్ దీప్ (32) అనే వ్యక్తి ఆగ్రా (Agra) లోని ఎయిర్ ఫోర్స్ స్టేషనులో ఐఏఎఫ్ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా పని చేస్తున్నారు. ఈయన సతీమణి రేణూ తన్వర్ అదే నగరంలోని సైనిక ఆస్పత్రిలో ఆర్మీలో కెప్టెన్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే.. ఇటీవల తన్వర్ తన తల్లి, సోదరుడితో కలిసి వైద్య చికిత్స కోసం ఢిల్లీకి వెళ్లారు. ఇంతలో ఏమైందో తెలియదు. ఒకేరోజు ఈ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి భోజనం తర్వాత గదిలోకి వెళ్లిన దీప్ మరుసటి రోజు బయటకు రాకపోవడంతో సహోద్యోగులు తలుపు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
భోజన సమయంలో దీప్ తమతో సరదగానే మాట్లాడారని.. అప్పుడు అతడి ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని సహోద్యోగుల్లో ఒకరు వెల్లడించారు. ఉదయం ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానంతో తలుపులు పగలగొట్టి చూసేసరికి దీప్ విగతజీవిగా కనిపించారని పోలీసులకు తెలిపారు.
మరోవైపు.. అదేరోజు తన్వర్ కూడా ఢిల్లీ కంటోన్మెంట్‌లోని అధికారుల మెస్ హాల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అక్కడున్న సిబ్బంది సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమె మృతదేహం పక్కన సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. తన భర్త మృతదేహంతో కలిపి తనకూ దహన సంస్కారాలు నిర్వహించాలని ఆమె కోరారు. తన్వర్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె తల్లి, సోదరుడు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీప్ వద్ద ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదు. దీంతో అతడి మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.