మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 నవంబరు 2021 (13:29 IST)

అమ్మమ్మతో సహజీవనం చేస్తూ బాలికపై 80 యేళ్ళ వృద్ధుడు అత్యాచారం

హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. అమ్మమ్మతో సహజీవనం చేస్తూ వచ్చిన 80 యేళ్ల వృద్ధుడు ఒకడు 11యేళ్ళ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం చాంద్రాయణగుట్టలో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక పంజెషాకు చెందిన హబీబుద్దీన్ బషీర్ అనే 80 యేళ్ళ వృద్ధుడు స్థానికంగా ఉండే ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈమెకు 11 యేళ్ళ మనవరాలు ఉంది. 
 
ఈ బాలికపై కన్నేసిన బషీర్.. నెల రోజుల క్రితం లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే నీతోపాటు మీ అమ్మమ్మను కూడా చంపేస్తానని బాలికను బెదిరించాడు. దీంతో ఆ బాలికకు జరిగిన దారుణంపై నోరు మెదపలేదు. 
 
ఈ క్రమంలో ఆ బాలిక ప్రవర్తనలో మార్పురావడాన్ని గమనించిన అమ్మమ్మ ఆరాతీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బషీర్‌ను నిలదీయగా తనకేం తెలియదంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. 
 
అయితే, బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా అసలు విషయం తెలిసింది. దీంతో బాలికను వెంటబెట్టుకుని వెళ్లి ఆఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.