కాబోయే భార్యతో ఉరివేసుకున్నట్టుగా సెల్ఫీ దిగిన యువకుడు.. విషాదాంతంగా ముగిసిన ఫ్రాంక్
తనకు కాబోయే భార్యతో సరదాగా మాట్లాడుతూ, ఉరివేసుకుంటున్నట్టుగా నాటకమాడిన ఓ యువకుడి కథ విషాదాంతంగా ముగిసింది. పొరబాటున వైర్ మెడకు బిగుసుకోవడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం మేరకు... తిలక్ నగర్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ గ్యార ఆదర్శ్ (25)కు ఇటీవలే ఓ యువతితో వివాహం జరిగింది. వచ్చే నెలలో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. ఇక వివాహానికి సంబంధించిన ఏర్పాట్లను ఇరు కుటుంబాల సభ్యులు మొదలుపెట్టారు. అయితే, వివాహ నిశ్చితార్థం కావడంతో యువతీయువకులిద్దరూ ఫోనులో తరచుగా మాట్లాడుకోసాగారు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి తనకు కాబోయే భార్యను ఆదర్శ్ ఆటపట్టించాలని భావించాడు. ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా నాటకం ఆడాలని భావించిన ఆదర్శ్.. ఫ్యాన్‌కు ఐరన్ బాక్స్ వైరుతో ఉరి వేసుకుంటున్నట్టుగా సెల్ఫీ ఫోటో దిగాడు. ఆ ఫోటోను కాబోయే భార్యకు వాట్సాప్ ద్వారా పంపించాడు.
ఆ తర్వాత కిందకు దిగే ప్రయత్నంలో ఉండగా, ప్రమాదవశాత్తు ఆదర్శ్ మెడకు వైర్ బిగిసుకుంది. ఆ సమయంలో అతన్ని కాపాడేందుకు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆదర్శ్ మృతి చెందాడు. మంగళవారం ఉదయం ఆదర్శ్ కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా విగతజీవుడై కనిపించాడు. దీంతో వారంతా బోరున విలపిస్తూ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.