శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 మే 2024 (18:05 IST)

వాయిస్ చేంజింగ్ యాప్‌ ఉపయోగించి యువతులపై అత్యాచారం ... ఎక్కడ?

victim girl
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ నిరక్షరాస్యుడు ఏకంగా ఏడుగురు గిరిజన యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వాయిస్ చేంజింగ్ యాప్ (మహిళ గొంతు)తో మాట్లాడి యువతులను నమ్మించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. చివరకు అతని పాపం పండటంతో పోలీసులకు చిక్కాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధి జిల్లాకు చెందిన బ్రజేష్ కుష్వాహా ఓ మాజీ మిల్లు కార్మికుడు. తన ప్రాంతంలో నివసించే అమాయక గిరిజన కాలేజీ విద్యార్థినులపై కన్నేసి ఓ భారీ ప్లాన్ వేశాడు. 
 
వాయిస్ మార్ఫింగ్ యాప్ ఉపయోగించి తన స్వరాన్ని ఓ కాలేజీ మహిళా టీచర్ స్వరంలా మార్చి వారితో సెల్‌ఫోనలో మాట్లాడేవాడు. స్కాలర్ షిప్ ఇప్పిస్తానని.. ఇందుకోసం నిర్మానుష్యంగా ఉండే ప్రాంతానికి వెళ్తే అక్కడికి ఓ వ్యక్తిని పంపిస్తానని.. అతను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని తన (టీచర్) ఇంటికి తీసుకొస్తాడని నమ్మించేవాడు. అలా వారు బైక్ ఎక్కగానే సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడేవాడు. అలా ఏడుగురు యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
యువతులను కలిసేందుకు వెళ్లినప్పుడు నిందితుడు మొహం కనిపించకుండా హెల్మెట్ ధరించేవాడని అత్యాచార బాధితులు పోలీసులకు చెప్పారు. అయితే అతని చేతికి ఎప్పుడూ గ్లోవ్స్ ఉండేవని వివరించారు. ఈ క్లూ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు కుష్వాహాను పట్టుకున్నారు. మహారాష్ట్రలోని ఓ రోలింగ్ మిల్లులో పనిచేస్తున్నప్పుడు చేతులు కాలిపోవడంతో అతను బ్లౌజ్‌లు ధరించి తిరుగుతున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. 
 
అతనికి సహకరించిన మరో ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేశారు. మరోవైపు సిధి జిల్లా యంత్రాంగం అతని ఇంటిని బుల్డోజర్‌తో నేలమట్టం చేసింది. ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఐజీ మహేంద్ర సికార్ వర్ తెలిపారు. 
 
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఇంకెవరైనా బాధితులు ఉన్నారో లేదో దర్యాప్తు చేసేందుకు 9 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు ఆదేశించారు. దీంతో ఓ మహిళా డీఎస్పీ సారథ్యంలో సిట్ ఏర్పాటైంది. మరోవైపు వాయిస్ చేంజింగ్ యాప్‌ల దుర్వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెల్ ప్రజలను అప్రమత్తం చేసింది.