సోమవారం, 14 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (09:20 IST)

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది. దీన్ని కన్నతండ్రి జీర్ణించుకోలేకపోయాడు. పైగా, తమ కుమార్తె చేసిన పాడుపనికి గ్రామంలో తన పరువు పోయిందని మనోవేదనకు గురయ్యాడు. ఈ అవమాన భారాన్ని జీర్ణించుకోలేక ఆ కన్నతండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా చిట్యాలలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చిట్యాల పట్టణానికి చెందిన రెముడాల గట్టయ్య (48) అనే వ్యక్తి కుమార్తె మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది. అదే పట్టణానికి చెందిన దళిత యువకుడిని ప్రేమించింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు తెలియకుండా గత నెల 8వ వివాహం చేసుకుంది. దీనిపై గట్టయ్య... తన కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గట్టయ్య కుమార్తె వివాహం చేసుకుని జిల్లా ఎస్పీ దగ్గర సరెండర్ అయిన విషయం తెలుసుకున్నారు. తల్లిదండ్రులు కలిసేందుకు ఆమె ఇష్టపడటం లేదని గట్టయ్యకు చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన గట్టయ్య ఈ నెల 10వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను నార్కట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, ఆయన పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నగరానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. తండ్రి మృతివార్తను బంధువులు ఫోను ద్వారా కుమార్తెకు తెలియజేసి, కన్నతండ్రి చివరి చూపు కోసం రావాలని కోరినా ఆ యువతి రాలేదు.