శుక్రవారం, 14 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 26 మే 2023 (19:41 IST)

పెళ్లై ఏడాది: అమెరికాలో భర్త గుండెపోటుతో కన్నుమూత, తట్టుకోలేని భార్య ఆత్మహత్య

image
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
హైదరాబాదులో విషాదకర ఘటన జరిగింది. తన భర్త మరణాన్ని తట్టుకోలేని వివాహిత ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులోని వనస్థలిపురంకు చెందిన 31 ఏళ్ల మనోజ్ సాఫ్ట్వేర్ ఇంజినీరుగా అమెరికాలోని డల్లాస్‌లో పనిచేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం అంబర్ పేటకు చెందిన 29 ఏళ్ల సాహితిని వివాహం చేసుకున్నాడు. వెంటనే తన భార్యను అమెరికాకు తీసుకుని వెళ్లాడు.
 
ఈ నెల మే నెల 2న తన తల్లిదండ్రులను చూసేందుకు హైదరాబాదు వచ్చింది సాహితి. మే నెల 20న డల్లాస్‌లో వున్న మనోజ్ తీవ్ర గుండెపోటుకి గురయ్యాడు. దీనితో అతడి స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఐతే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మనోజ్ ప్రాణాలు కోల్పోయాడు. 23న అమెరికా నుంచి మనోజ్ భౌతిక కాయాన్ని హైదరాబాదుకి తీసుకుని వచ్చారు.
 
24న అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం సాహితి తన తల్లిదండ్రులతో కలిసి ఇంటికి చేరుకుంది. ఐతే భర్త మరణాన్ని తట్టుకోలేని సాహితి గురువారం ఉదయం వేళ ఇంట్లో ఫ్యానుకి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. నిండునూరేళ్లు చల్లగా వుండాల్సిన జంట తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సాహితి మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.