శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జులై 2024 (10:39 IST)

ఫుడ్ డెలివరీ బాయ్‌లు వచ్చి కిరాతకంగా నరికేశారు... ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో 8 మంది అరెస్టు

BSP Armstrong Murder
బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్‌ను ఎనిమిది మంది ముఠా సభ్యులు ఫుడ్ డెలివరీ బాయ్‌లుగా వచ్చి దారుణంగా నరికి చంపేశారు. చెన్నై నగరంలోని సెంబియం ప్రాంతంలో ఉన్న తన నివాసానికి సమీపంలో కొంతమంది పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా బైకులపై వచ్చిన ఎనిమిది వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆర్మ్ స్ట్రాంగ్‌ను కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
కాగా ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇది ప్రతీకార హత్య కావొచ్చని అనుమానం వ్యక్తం చేయగా అది నిజమని తేలింది. గతంలో ఆర్కాడ్ సురేష్ అనే రౌడీ హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య చేసినట్టు నిందితులు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. నిందితులు ఫుడ్ డెలివరీ ఏజెంట్లు మాదిరిగా వచ్చి హత్య చేశారు. 
 
కాగా, ఈ హత్యను బీఎస్పీ చీఫ్ మాయావతి ఖండించారు. ఆర్మ్ స్ట్రాంగ్ దళితుల బలమైన గొంతుక అని, అతడిని హత్య చేసిన దోషులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. ఈ హత్య నేపథ్యంలో అధికార డీఎంకేపై ప్రతిపక్ష ఏఐఏడీఎంకే విరుచుకుపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ఈ హత్యే అందుకు నిదర్శనమని తీవ్రంగా విమర్శించింది. ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధినేత హత్యకు గురయ్యాక ఇంకేం మాట్లాడగలమని, రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితి సిగ్గుచేటని ప్రతిపక్ష ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి తీవ్రంగా విమర్శించారు.
 
కాగా ఆర్మ్ స్ట్రాంగ్ న్యాయవాదిగా కూడా పనిచేస్తున్నారు. 2006లో చెన్నై కార్పొరేషన్ కౌన్సిలు ఎన్నికయ్యారు. రెండేళ్ల క్రితం చెన్నైలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీకి బీఎస్పీ అధినేత్రి మాయావతిని ఆహ్వానించారు. ఈ ర్యాలీ తర్వాత ఆయన గుర్తింపు మరింత పెరిగింది. కాగా స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుల్లో తిరుమల, అరల్, సెల్వరాజ్, సంతోష్, మణివన్నన్, రాము, పొన్ని బాలు, తిరువేంగటంలు ఉన్నారు.