శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 2 జులై 2024 (09:59 IST)

దేవుడి ముందు లొంగిపోయాడు.. అందుకే మరణ శిక్ష రద్దు : ఒరిస్సా హైకోర్టు

court
అత్యాచారం కేసులో దోషిగా తేలిన ముద్దాయికి కింది కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత శిక్షగా మార్చింది. ముద్దాయి దేవుడి ముందు లొంగిపోయాడని, తాను చేసిన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడని పేర్కొంటూ ఈ మేరకు తీర్పునిచ్చింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన ఎస్కే ఆసిఫ్ అలీకి ఒడిశాలోని జగత్‌సగురులో ఉన్న పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. దీనికి సంబంధించి జూన్ 27వ తేదీన 106 పేజీల తీర్పును హైకోర్టు ఇచ్చింది. తీర్పుఇచ్చే క్రమంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
"ఈ కేసులో దోషిగా తేలిన ఆసిఫ్ అలీ రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడు. అతడు దేవుడి ముందు లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతడికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నాం" అని తీర్పు ఇచ్చే సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. బాధిత బాలిక కుటుంబానికి రూ.1.50 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని పోక్సో కోర్టు ఆదేశించగా.. దాన్ని సవరించిన న్యాయస్థానం రూ.10 లక్షలు అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.