గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 మే 2022 (09:23 IST)

ఇష్టం లేని పెళ్లి చేశారనీ ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య

murder
తనకు ఇష్టం లేని పెళ్లి చేశారన్న అక్కసుతో తన ప్రియుడితో కలిసి తాళి కట్టిన భర్తను చంపేసిందో భార్య. ఈ దారుణం తెలంగాణా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం చిన్న నిజాంపేటలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని చిన్ననిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్ (24) అనే యువకుడికి తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన శ్యామల (19)తో మార్చి 23వ తేదీన వివాహం జరిగింది. అయితే, శ్యామల పెళ్ళికి ముందు నుంచే అదే గ్రామానికి చెందిన శివకుమార్ (20) అనే యువకుడితో ప్రేమలో మునిగితేలుతూ వచ్చింది. 
 
పెద్దల ఒత్తిడితో చంద్రశేఖర్‌ను పెళ్లి చేసుకున్నప్పటికీ శివకుమార్‌ను మాత్రం మరిచిపోలేక పోయింది. అటు ఇష్టంలేని భర్తతో కాపురం చేయలేక కుమిలిపోతూ వచ్చింది. దీంతో తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేలా ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని తన ప్రియుడికి కూడా చెప్పింది. 
 
తమ ప్లాన్‌లో భాగంగా తొలుత గత నెల 19వ తేదీన ఆహారంలో ఎలుకలు మందు కలిపి భర్తకు వడ్డించింది. దీంతో తీవ్ర అస్వస్థతకు లోనై చంద్రశేఖర్‌ను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా అక్కడ కొన్ని రోజుల చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. తొలి ప్లాన్ వికటించడంతో ఈ దఫా పక్కాగా ప్లాన్ వేసింది. 
 
తనకు మొక్కుఉందని, దాన్ని తీర్చుకునేందుకు వెళ్దామంటూ భర్తతో కలిసి గత నెల 28వ తేదీన బైకు‌పై బయలుదేరింది. ఈ క్రమంలో అనంతసాగర్ శివారులో ఏకాంతంగా గడుపుదామంటూ భర్తను రెచ్చగొట్టి అక్కడ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. 
 
అప్పటికే అక్కడ మాటువేసిన ప్రియుడు శివకుమార్ అతని స్నేహితులు రాకేశ్, రంజిత్, శ్యామల మేనమామ సాయికృష్ణ, వరుసకు సోదరుడైన భార్గవ్‌లు కలిసి చంద్రశేఖర్‌పై దాడి చేశారు. ఆ తర్వాత వారంతా చంద్రశేఖర్‌ను కదలకుండా పట్టుకోగా, తన ప్రియుడు శివతో కలిసి శ్యామల భర్త మెడకు రుమాలు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసింది. 
 
ఆ తర్వాత అత్తిల్లు, పుట్టింటివారికి ఫోన్ చేసి తన భర్త ఛాతినొప్పితో చనిపోయినట్టు చెప్పింది. అయితే, చంద్రశేఖర్ తల్లిదండ్రులు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకివచ్చింది. దీంతో శ్యామల, ఆమె ప్రియుడు శివకుమార్, వారికి సహకరించిన వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.