శుక్రవారం, 21 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 20 మార్చి 2025 (16:51 IST)

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

భర్తను పరాయి స్త్రీ కన్నెత్తి చూస్తే తట్టుకోలేరు భార్యలు. అలాంటిది ఓ భార్య ఏకంగా తన భర్తతో పడకసుఖం పంచుకోవాలంటూ ఓ పనిమనిషిపైన తీవ్రంగా ఒత్తిడి చేసింది. అది భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్, షాపూర్ పోలీసు స్టేషను పరిధిలో బ్రిజిపాల్ సింగ్, సోనియా సింగ్ నివాసముంటున్నారు. తమ ఇంట్లో వంట పని చేసేందుకు ఓ మహిళ కావాలంటూ ప్రకటన ఇచ్చారు. ఖుషీనగర్ ప్రాంతంలో వుంటున్న ఓ మహిళ ఈ ప్రకటనను చూసి వారివద్దకు వెళ్లింది.
 
వంట పని చేసినందుకు నెలకి రూ. 10 వేలు ఇస్తామని వారు చెప్పారు. అందుకు అంగీకరించిన ఆ మహిళ వంట చేసేందుకు రోజూ వస్తోంది. ఐతే రెండు వారాలు గడిచాక సోనియా సింగ్ వంట చేస్తున్న మహిళ వద్ద తమకు సంతానం లేదని ఆవేదన వ్యక్తం చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఓరోజు వంట చేస్తున్న మహిళ వద్దకు వచ్చి... తన భర్తతో దాంపత్యం చేసి గర్భవతివి కావాలంటూ తన కోర్కెను బయటపెట్టింది. తొలుత సోనియా అభ్యర్థనను బాధిత మహిళ సున్నితంగా తిరస్కరించింది. ఐతే సోనియా సింగ్ తన పట్టు విడిచిపెట్టలేదు.
 
మరుసటి రోజు వంట చేసేందుకు వచ్చిన మహిళను గదిలో బంధించి తన భర్తతో ఆమెపై అఘాయిత్యం చేయించేందుకు ప్రయత్నించింది. తమ కోర్కె తీర్చకపోతే ప్రాణం తీస్తామంటూ తీవ్రంగా హెచ్చరించింది. మళ్లీ తనే... తాము సంతానం లేక బాధపడుతున్నామనీ, తన భర్తతో పడుకుని ఒక పాపనో, బాబునో కంటే... అజ్మీర్ ప్రాంతంలో తన పేరుపై వున్న ఫ్లాట్ లేదా భూమిని బహుమతిగా రాసిస్తానంటూ ఆశ చూపించింది. సోనియా సింగ్ ఎన్ని ఆశలు చూపినా బాధిత మహిళ లొంగలేదు. తనపై జరుగుతున్న దాడిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే అప్పటికే ఆ జంట ఆ ఇంటిని వదిలేసి పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.