గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (12:25 IST)

టీఎస్ పీఎస్సీలో లీకేజీ కలకలం - పరీక్ష రద్దుపై ఉత్కంఠ

tspsc logo
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ నిర్వహించిన పరీక్షల్లో లీకేజీ కలకలం చెలరేగింది. తాజాగా కూడా మరో ప్రశ్నపత్రం లీకైంది. దీంతో టీఎస్ పీఎస్సీ పరీక్షను రద్దు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. తాజాగా కూడా మరో ప్రశ్నపత్రం లీకైనట్టు వార్తలు రావడంతో ఈ పరీక్ష రద్దు కోసమే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. 
 
ఇటీవల టీఎస్ పీఎస్సీ వెటర్నరీ అసిస్టెంట్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షా ప్రశ్నపత్రాలను ప్రవీణ్ అనే ఉద్యోగి లీక్ చేసినట్టు గుర్తించారు. మార్చి మొదటి వారంలో నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్నపత్రం కూడా లీకైందని పోలీసులు నిర్దారించారు.ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ నియామక పరీక్షను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసినట్టు తెలుస్తుంది. 
 
కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రవీణ్ టీఎస్ పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. కంప్యూటర్లలో భద్రపరిచిన ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్ తన పెన్ డ్రైవ్‌లో కాపీ చేసుకుని వాటిని రేణుక అనే మహిళకు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. 
 
రేణుక ఆ ప్రశ్నపత్రాలను రూ.13.5 లక్షలకు ఇద్దరు అభ్యర్థులకు విక్రయించారు. మరోవైపు, ఈ కేసులో రేణుకతో పాటు ఆమె భర్త, సోదరుడు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం.