గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (15:53 IST)

మాజీ మంత్రి నారాయణకు షాక్.. బెయిల్ రద్దు చేసిన జిల్లా కోర్టు

narayanap
టీడీపీ నేత, మాజీ మంత్రి, పి.నారాయణకు చిత్తూరు జిల్లా కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 10వ తరగతి పరీక్ష పేపర్ల లీక్ కేసులో నారాయణకు గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను కోర్టు రద్దు చేసింది. 
 
10వ తరగతి పరీక్ష పేపర్ల లీక్ కేసులో నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది ఏప్రిల్‌లో అరెస్టయిన అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 
అయితే, నారాయణ బెయిల్ రద్దు చేయాలని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు 9వ అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు నారాయణ బెయిల్‌ను రద్దు చేసింది. నవంబర్ 30లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
 
ఈ ఏడాది ఏప్రిల్‌లో చిత్తూరు జిల్లా నెల్లెపల్లి హైస్కూల్‌లో 10వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకైనట్లు వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది. దీని వెనుక నారాయణ హస్తం ఉందంటూ చిత్తూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే నారాయణ తరపు న్యాయవాదులు 2014లో నారాయణ సంస్థల అధినేత పదవి నుంచి తప్పుకున్నారని కోర్టుకు తెలిపారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం బెయిల్‌ను చిత్తూరు జిల్లా 9వ అదనపు కోర్టు రద్దు చేసింది.