అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు - దేశ వ్యాప్తంగా 529 రైళ్లు రద్దు
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో దేశ వ్యాప్తంగా రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ భారత్ బంద్ దృష్ట్యా సోమవారం 529 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. వీటిలో ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఉండటం గమనార్హం. ఇదే విషయంపై కేంద్ర రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
అగ్నిపథ్ ఆందోళనలు 529 రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపించాయని రైల్వే శాఖ పేర్కొంది. నేడు దేశవ్యాప్తంగా 529 రైళ్లు రద్దయినట్లు తెలిపింది. ఇందులో 181 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాగా.. 348 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఇక నాలుగు మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఆరు ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.
అగ్నిపథ్ పథకంపై ఆందోళన చేపట్టిన యువత ప్రధానంగా రైల్వే స్టేషన్ల వద్దే నిరసనలు చేపడుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ సహా బీహార్, యూపీ వంటి రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లలో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచాయి.