సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 జూన్ 2024 (08:41 IST)

కేవలం ఒక్క రూపాయి కోసం గొడవకు ఓ నిండు ప్రాణం పోయింది... ఎక్కడ?

One Rupee
కేవలం ఒక్క రూపాయి కోసం జరిగిన గొడవకు ఓ నిండు ప్రాణం పోయింది. ఈ విషాదకర ఘటన వరంగల్‌ జిల్లా లేబర్‌కాలనీలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. క్రిస్టియన్‌ కాలనీకి చెందిన యువకుడు జన్ను అరవింద్‌కు వరంగల్‌ గరీబ్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ ఈసంపెల్లి ప్రేమ్‌సాగర్‌ (38) మధ్య లేబర్‌కాలనీ బిర్యానీ పాయింట్(రూ.59కే బిర్యానీ) వద్ద శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. పొద్దంతా ఆటో నడిపి ఇంటికి వెళ్లే క్రమంలో ప్రేమ్‌సాగర్‌ రూ.60 ఇచ్చి బిర్యానీ కొన్నారు. 
 
హోటల్‌ యజమాని రూపాయి తిరిగి ఇవ్వకపోవడంతో అడిగి మరీ తీసుకున్నారు. ఇంతలో జన్ను అరవింద్‌ ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చి రూ.60 ఇచ్చి బిర్యానీ కొనుగోలు చేశారు. రూపాయి అడగకుండా వెళుతుండటంతో.. డబ్బులు ఎక్కువ ఉన్నాయా? రూపాయి ఎందుకు తీసుకోవడం లేదని అరవింద్‌పై ప్రేమ్‌సాగర్‌ కామెంట్ చేశాడు. ఈక్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు ఘర్షణ జరిగిన తర్వాత ఆటో తీసుకుని ప్రేమ్‌సాగర్‌ అక్కడి నుంచి వెళ్లేందుకు యత్నించాడు. 
 
అయితే, అపుడు అక్కడే ఉన్న అరవింద్‌ ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన అరవింద్‌.. అనవసరంగా నాతో గొడవ పడడమే కాకుండా ఆటోతో బైకును ఢీ కొడతావా? అంటూ ప్రేమ్‌సాగర్‌పైకి దూసుకెళ్లి పిడిగుద్దులు కురిపించాడు. కిందపడిపోయిన ప్రేమ్‌సాగర్‌ చెవి, ముక్కులోంచి రక్తం రావడంతో అది చూసిన అరవింద్‌ అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. 
 
పక్కనే ఉన్న చికెన్‌ షాపు యజమాని కలగజేసుకొని గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. అలా వదిలేసి పారిపోతున్నావేంటి? అని ప్రశ్నించడంతో ప్రేమ్‌సాగర్‌ను శుక్రవారం రాత్రి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించాడు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్‌ మరణించారు. పోస్టుమార్టం అనంతరం శనివారం మృతదేహాన్ని గరీబ్‌నగర్‌కు తీసుకొచ్చారు. 
 
ఈ క్రమంలో జన్ను అరవింద్‌ శనివారం పోలీసులకు లొంగిపోయాడు. అరవింద్‌ గతంలో ఎనుమాముల మార్కెట్లో బస్తాలు మోసేవాడు. ఆ తర్వాత కొన్నేళ్లు ఆటో నడిపాడు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. ప్రేమ్‌సాగర్‌ మృతిపై ఆయన సోదరుడు ఈసంపెల్లి విద్యాసాగర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మిల్స్‌కాలనీ సీఐ మల్లయ్య తెలిపారు.