బెడ్రూంలో నాతో కలిసి నా భర్త ఏకాంత వీడియోలు, అరెస్ట్ చేయండి అంటూ భార్య ఫిర్యాదు
మహారాష్ట్ర లోని నాగ్ పూర్ సిటీలో ఓ భర్త నిర్వాకాన్ని భార్య బయటపెట్టింది. పెళ్లయిన దగ్గర్నుంచి తనతో బెడ్రూంలో గడిపినప్పుడల్లా ఆ దృశ్యాలను వీడియో తీయడమే కాకుండా పలు అభ్యంతరకర రీతుల్లో తనను వీడియో తీసి వేధిస్తున్నాడనీ, అతడిని అరెస్ట్ చేయాలంటూ ఓ భార్య పోలీసులను ఆశ్రయించింది. ఐతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి భార్యతో అలాంటి శృంగారం తప్పుకాదు కనుక తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేసారు. ఐతే ఆమె తన భర్త దారుణ ప్రవర్తనను ఎలాగైనా కోర్టు ముందు ప్రవేశపెట్టాలని అతడి సెల్ ఫోనుని హ్యాక్ చేసింది. ఆ తర్వాత ఆ ఫోనులో వున్న డేటాను చూసి షాక్ తిన్నది. అది చూసిన పోలీసులు కూడా రెండో ఆలోచన లేకుండా అతడిని అరెస్ట్ చేసి రిమాండుకు పంపించారు. ఇంతకీ అతడు ఏం చేసాడు? పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
33 ఏళ్ల అబ్దుల్ ఖురేషి 2021లో వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న దగ్గర్నుంచి భార్యతో గడిపే బెడ్రూం ఏకాంత సమయాన్ని వీడియోలు తీస్తూ పైశాచికానందం పొందేవాడు. ఇతడి ప్రవర్తనకు విసిగిపోయిన భార్య అతడికి ఎన్నోసార్లు నచ్చజెప్పింది. ఐనా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరికి తనను మరీ అభ్యంతరకర రీతిలో వీడియోలు తీయడం సహించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ భర్త చేసే ఇలాంటి శృంగార చేష్టలు తప్పు కాదనీ, అందువల్ల తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేసారు.
దీనితో బాధిత భార్య తన భర్త సెల్ ఫోనుని హ్యాక్ చేసింది. అనంతరం అందులో వున్న డేటాను మొత్తం తస్కరించి చూడగా షాకింగ్ వీడియోలు బయటపడ్డాయి. తన భర్త తనతో కాకుండా మరికొందరు మహిళలతో ఇదే రీతిలో శృంగారం చేస్తున్నట్లు వున్న వీడియోలు లభించాయి. వీరిలో 19 ఏళ్ల యువతి కూడా వుంది. దాంతో ఆమె అతి కష్టమ్మీద ఆ యువతికి ఫోన్ చేసి తన భర్త గురించి వాకబు చేసింది.
తనకు పెళ్లి కాలేదని తనతో చెప్పాడనీ, తనను వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా తనను లొంగదీసుకున్నట్లు ఆ యువతి వెల్లడించింది. తన భర్త మోసగాడని గ్రహించిన బాధిత భార్య సదరు యువతిని తీసుకుని పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేసింది. వీడియోలను చూసిన పోలీసులు వెంటనే అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.