సోమవారం, 17 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 మార్చి 2025 (11:41 IST)

మూణ్ణాళ్ల ముచ్చటగా ఇన్‌‍స్టాగ్రామ్ ప్రేమపెళ్లి.. వరకట్న వేధింపులతో ఆర్నెల్లకే బలవన్మరణం

suicide
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడుని ప్రేమించిన ఓ యువతి తన తల్లిదండ్రులను ఎదిరించి మరీ ప్రేమ పెళ్లి చేసుకుంది. కానీ, వివాహం జరిగిన ఆరు నెలల్లోనే ఆమె తిరిగిరాని లోకాలకు చేరుకుంది. కట్నం పేరుతో చిత్రహింసలకు గురిచేసిన భర్త.. చివరకు ఆమె ప్రాణాలు కూడా తీశాడు. దీంతో ఇన్‌స్టా ప్రేమ, పెళ్లి మూణ్ణాళ్ళ ముచ్చటగా మారిపోయింది. ఈ విషాదకర ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా నల్లపాడులో జరిగింది. 
 
స్థానిక ఎస్ఐ వెల్లడించిన వివరాల మేరకు... తెలంగాణ రాష్ట్రం వరంగల్‌కు చెందిన గీతిక (19) అనే యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో గుంటూరులోని ద్వారకా నగర్‌కు చెందిన సాయి మణికంఠ అనే యువకుడు పరిచయమయ్యాడు. అతడు పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. అతడి మాటలు నమ్మిన గీతిక తన తల్లిదండ్రులను ఎదిరించి, వారికి తెలియకుండానే ప్రేమ పెళ్లిని గత యేడాది డిసెంబరు నెల 17వ తేదీన చేసుకుంది. 
 
కొంతకాలం బాగానే సంసార జీవితాన్ని కొనసాగించిన మణికంఠ... ఆ తర్వాత గంజాయికి బానిసయ్యాడు. అదేసమయంలో గీతికకు అత్తింటి వారి నుంచి వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయి. ఇటు అత్తింటివారు, అటు కట్టుకున్నవాడు మానసికంగా వేధిస్తూ, చిత్ర హింసలకు గురిచేయడం మొదలుపెట్టారు. కట్నం తీసుకురావాలంటూ నిత్యం వేధించసాగాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన కష్టాలను, వేధింపులను చెప్పుకుని బోరున విలపించింది. ఆ తర్వాత నుంచి ఆమె ఫోన్ మూగబోయింది. 
 
ఈ క్రమంలో మీ కుమార్తె ఉరేసుకుని ప్రాణాలుతీసుకుందంటూ మణికంఠ తండ్రి ఈ నెల 15వ తేదీన మృతురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు గుంటూరుకు చేరుకుని ఆందోళనకు దిగారు. గీతికను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపతున్నారు.