భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య... ఆమెపై అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్
తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ కట్టుకున్న భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంటికి బయలుదేరిన 29 యేళ్ల మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమె ప్రయాణించిన ఆటో డ్రైవర్ తన స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని అల్వాల్ పరిధిలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే,
శుక్రవారం సాయంత్రం యాప్రాల్‌లో ఓ మహిళ ఉబెర్ ఆటో (వాహనం నంబరు ఏపీ 11టీఏ 0266) బుక్ చేసింది. అందులో డ్రైవర్ పేరు ఎస్.శంకర్ అని ఉంది. ఆ ఆటో రాగానే ఎక్కి ఆల్వాల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పని ముగియగానే మళ్లీ అదే ఆటోలో ఇంటికి తిరుగు ముఖం పట్టింది. అప్పటికే ఆమెపై కన్నేసిన డ్రైవర్, ఆమెను మాటల్లోకి దించాడు. ఈ క్రమంలో పలు వీధుల్లో తిప్పుతూ ఓ మద్యం షాపు వద్ద ఆటోను ఆపాడు.
అక్కడ ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకున్నారు. ఆమె అభ్యంతరం చెప్పినా ఆటో డ్రైవర్ వినలేదు. ఆ ఇద్దరు, మద్యం తాగుతూ మహిళ వద్దువద్దంటున్నా ఆమెతోనూ బలవంతంగా మద్యం తాగించారు. వాహనాన్ని అల్వాల్‌లోని వెంకట్రావు లేన్‌లో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బెదిరింపులకు గురిచేసి ఓ కారు ఎక్కించారు. తర్వాత ఆటో డ్రైవర్ అక్కడి నుంచి తన వాహనంతో వెళ్లిపోగా, కారులోనే ఇద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 2:45కు ఆ ఇద్దరి నుంచి తప్పించుకొని బాధితురాలు రోడ్డు మీదకొచ్చి కాపాడడంటూ కేకలు వేసింది.
ఓ గూడ్స్ క్యారియర్ ఆటో డ్రైవర్ సాయంతో ఆ వాహనంలోనే సమీపంలోని గణేశ్ ఆలయం వద్దకు చేరుకుంది. అక్కడ స్థానికుల సాయంతో డయల్ 100కు కాల్ చేసి ఘటనపై ఫిర్యాదు చేసింది. బొల్లారం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఘటనపై శుక్రవారం జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, కేసును అల్వాల్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆటో డ్రైవర్ శంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.