శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మే 2022 (09:59 IST)

అల్లూరి సీతారామరాజు వర్థంతి: బ్రిటీష్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు

Alluri SitaRamaRaju
భారత స్వాతంత్య్ర సమరంలో అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం ఓ ప్రత్యేక అధ్యాయం. స్వాతంత్ర్య యుద్ధంలో మహోజ్వల శక్తిగా అవతరించి.. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు ఆయన.
 
కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహాశక్తితో పోరుకు సై అన్నాడు. నేడు ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ.. ఆయన కృషిని గుర్తు చేసుకుందాం.. 
 
అల్లూరి సీతారామరాజు 1897 జులై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారు. అయితే పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో. రామరాజు తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి.. సంస్కృతం, జోతిష్యశాస్త్రం, జాతక శాస్త్రం, విలువిద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారు. 
 
సీతారామరాజు ఇంటిపేరు అల్లూరి. కోమటి లంక గోదావరిలో మునిగిపోవడం వల్ల అప్పనపల్లి చేరారు అల్లూరి వారు. అల్లూరి సీతారామరాజుకు తాతయ్య అయిన వెంకటకృష్ణం రాజు, అతని పెదతండ్రి వెంకట నరసిం హరాజు బొప్పూడి గ్రామంనుండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో స్థిరపడ్డారు. 
 
వెంకటకృష్ణం రాజు ఐదుగురు కొడుకులు రామచందర్రాజు, వెంకటరామరాజు (సీతారామరాజు తండ్రి), రామకృష్ణంరాజు, రంగరాజు, రామభద్రరాజు.
 
1917లో విశాఖపట్నం జిల్లా క్రిష్ణదేవీపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టారు. మన్యం ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి, బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలని మన్యం ప్రజలను పురిగొల్పారు. సీతారామరాజు ప్రధాన అనుచరుడు, సేనాని గంటందొర. ఈయనది నడింపాలెం గ్రామం. 
 
గంటందొర, మిగిలిన అనుచరుల సాయంతో బ్రిటిష్ అధికారులపై విప్లవానికి అల్లూరి తెరతీశారు. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై తొలిసారి దాడి చేశారు. 23వ తేదీన క్రిష్ణదేవీపేట పోలీస్ స్టేషన్, 24న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌పై దాడిచేశారు. 
 
ఈ మూడు స్టేషన్లపై దాడి ద్వారా భారీగా ఆయుధాలను సేకరించుకొని విప్లవం ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి వరసపెట్టి పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు అల్లూరి. ఈ విప్లవాన్ని ఎలాగైనా అణచివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం.. మన్యంలో ముమ్మర చర్యలు చేపట్టి చాలా మంది రాజు అనుచరులను చంపేసింది.
 
బ్రిటిష్ ప్రభుత్వం మన్యం ప్రజలను కాల్చుకు తినడం మొదలుపెట్టింది. ప్రభుత్వం ప్రజలను పెడుతున్న కష్టాలను చూడలేని రాజు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. 1924 మే 7న విశాఖపట్నం జిల్లా మంప గ్రామానికి సమీపాన సీతారామరాజు స్వయంగా లొంగిపోయారు. సీతారామరాజుపై పగతో రగిలిపోతున్న బ్రిటిష్ అధికారులు ఆయన్ని చింతచెట్టుకు కట్టి కాల్చిచంపారు. 
 
మే 8న రాజు అనుచరులు ఆయన భౌతికకాయాన్ని క్రిష్ణదేవీపేటకు తీసుకువచ్చి తాండవనది పక్కన దహన క్రియలు జరిపారు. సీతారామరాజు ఆశించి కలలుగన్న స్వాతంత్య్రం ఆయన ఆత్మత్యాగం చేసిన 28 సంవత్సరాలకు ఆగస్టు 15, 1947న భారత ప్రజలకు లభించింది.