మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (09:12 IST)

శశికళ అస్త్ర సన్యాసం వెనుక మతలబు ఏంటి? ఆ పార్టీతో కుదిరిన డీల్!

తమిళనాడు సంచలన మహిళగా గుర్తింపు పొందిన మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రియ నెచ్చెలి శశికళ క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మరో నెల రోజుల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శశికళ తీసుకున్న సంచలన నిర్ణయంపై ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆమె ఉన్నట్టు ఈ తరహా నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న అశంపై ఇపుడు ఊహకందని విషయంగా ఉంది. అయితే, ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకు బీజేపీ పెద్దల అస్త్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై గత నెలలోనే బీజేపీ పెద్దలతో ఈమె ఓ ఒప్పందం కుదుర్చుకున్నారనే ప్రచారం సాగుతోంది. 
 
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళపాటు బెంగుళూరులో జైలు శిక్ష అనుభవించిన అనంతరం ఇటీవలే చెన్నైకు చేరుకున్నారు. దీంతో అన్నాడీఎంకేలోని ఓ వర్గం తిరిగి తమకు మంచిరోజులు వస్తాయని భావించింది. ఆమె దగ్గరి బంధువు టీటీవీ దినకరన్, ఏకంగా తానే సీఎంను అవుతానన్న ధీమాను కూడా వ్యక్తం చేశారు. 
 
అయితే, అనూహ్యంగా తాను ఇక రాజకీయాల్లో ఉండబోనని ఆమె స్పష్టం చేయడం తమిళనాడు ప్రజలను షాక్‌కు గురిచేసింది. ఇంత సంచలన నిర్ణయాన్ని శశికళ తీసుకోవడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని ఇప్పుడు తమిళనాడులో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతుందని, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మరోమారు అధికారంలోకి వస్తుందని ఇప్పటికే ఒపీనియన్ పోల్ సర్వేలు వెల్లడించాయి. 
 
ఈ దశలో శశికళ తిరిగి రాజకీయాల్లో కొనసాగితే అన్నాడీఎంకేలో చీలిక రావడం ఖాయమని భావించిన బీజేపీ, అన్నాడీఎంకే విడిపోకుండా ఉండాలంటే, తాత్కాలికంగానైనా శశికళను రాజకీయాలకు దూరంగా ఉంచాలని భావించినట్టు వార్తలు వస్తున్నాయి.
 
గత నెలలో అమిత్ షా తమిళనాడులో పర్యటించిన సమయంలోనే శశికళతో డీల్ కుదిరిపోయిందని తమిళనాడు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. అందులో భాగంగానే ఆమె ఈ ప్రకటన చేశారని అంటున్నారు. అదే నిజమైతే, ఎన్డీయే నేతృత్వంలో అన్నాడీఎంకే తిరిగి తమిళనాడులో అధికారంలోకి వస్తే చాలని భావిస్తున్న బీజేపీ, ఆ మేరకు ప్రస్తుతానికి విజయవంతం అయినట్టే. 
 
ఇక కాంగ్రెస్ వెన్నుదన్నుగా ఉన్న డీఎంకే మాత్రం పరిస్థితి ఏదైనా, ఎవరు బరిలో ఉన్నా గెలుపు మాత్రం తమదేనని ఘంటాపథంగా చెబుతోంది. కాగా, దివంగత జయలలిత అధికారంలో ఉన్నప్పుడుగానీ, పదవిలో లేనప్పుడుగానీ తాను ఎన్నడూ అధికారం, పదవుల కోసం పాకులాడలేదని, ఆమె మరణించిన తర్వాత కూడా తనకు ఎటువంటి పదవీకాంక్ష లేదని నిన్న శశికళ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. జయలలిత ఆకాంక్ష మేరకు అన్నాడీఎంకే పది కాలాల పాటు అధికారంలో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని, అందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా కలిసి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.