సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Modified: మంగళవారం, 25 జూన్ 2019 (13:44 IST)

సుజనా చౌదరి వాళ్లతో టచ్‌లో? బాబుకి నిద్రలేని రాత్రులు...

తెదేపా మునిగిపోయే నావలా మారిపోతోందా? ఆ పార్టీ కూకటివేళ్లతో సహా పీకేసేందుకు రెండు పార్టీలు తమవంతు ప్రణాళికలు రచిస్తున్నాయా? పార్టీని కాపాడుకునేందుకు తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? పార్టీకి పెద్దదిక్కయిన చంద్రబాబు మాట వినే పరిస్థితిలో నాయకులు లేరా..? అసలు తెదేపా భవిష్యత్ ఏమవుతుంది... ఏం జరుగుతుంది?
 
ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెదేపా గురించి మాట్లాడుకుంటున్నారు. మొన్నటివరకూ ఓ వెలుగు వెలిగిన సైకిల్ పార్టీ ఒక్కసారిగా రిపెయిర్‌కు గురైంది. ఒకటి రిపేట్ చేస్తే మరొకటి పాడైపోతోంది. తెదేపా రాజ్యసభ ఎంపీలు గంపగుత్తగా భాజపాలోకి జంప్ అయ్యాక తెదేపాలో అయోమయం నెలకొంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కీలక విషయాలు... అంటే లోటుపాట్లు తెలిసిన నాయకుడిగా సుజనా చౌదరికి మంచి పేరుంది. ఎక్కడెక్కడ లొసుగులు వున్నాయో ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడిదే చంద్రబాబుకి టెన్షన్ పట్టుకుందట.
 
సుజనా కనుక నోరు విప్పి అన్నీ చెప్పేస్తే భాజపాకి తెదేపాను ఆడుకోవడం చాలా సుళువనే వాదన వినబడుతోంది. సుజనా చౌదరి పూర్తిస్థాయిలో భాజపాకి సహకరిస్తే తెలుగుదేశం పార్టీ నుంచి మరోసారి ఉప్పెనలా వలసలు జరిగే అవకాశం వుందంటున్నారు. అందువల్లనే చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కీలక నేతలకు ఫోన్లు చేస్తూ టచ్ లో వుంటున్నారట. ఎంత టచ్ లో వున్నాసరే రాత్రయ్యేసరికి ఎవరు ఎవరితో మంతనాలు చేస్తున్నారనే టెన్షన్లో వుంటున్నారట.
 
మరోవైపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెదేపా హయాంలో జరిగిన పనులన్నీ అక్రమాల పుట్ట అంటూ ఆధారాలతో సహా బయటపెట్టడమే కాకుండా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. వీటిని ఎలా ఎదుర్కోవాలో, ప్రజలకు ఎలాంటి సమాధానాలు చెప్పాలో తెలియక తెదేపా నాయకులు తల పట్టుకుని కూర్చుంటున్నారట. ఈ శిరోభారం నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం భాజపాలోకి జంప్ అవ్వడమే అని కొందరు నాయకులు చెప్పుకుంటున్నట్లు సమాచారం. మరి వచ్చే ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఎలా వుంటుందో చూడాల్సిందే.