గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Updated : సోమవారం, 21 నవంబరు 2016 (12:34 IST)

నోటుకు తాళం! అందుకే పంపిణీలో జాప్యం!! అదే మోదీ మాస్ట‌ర్ ప్లాన్?

న్యూఢిల్లీ : రాజు త‌లుచుకుంటే, దెబ్బ‌ల‌కు కొద‌వా? మోదీ త‌లుచుకుంటే, కొత్త నోట్ల‌కు కొద‌వా? ఎప్ప‌టి నుంచో ప్లానింగ్‌లో ఉన్న ప్ర‌ధానికి భారీగా కొత్త నోట్ల‌ను డంప్ చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.. కానీ, కా

న్యూఢిల్లీ : రాజు త‌లుచుకుంటే, దెబ్బ‌ల‌కు కొద‌వా? మోదీ త‌లుచుకుంటే, కొత్త నోట్ల‌కు కొద‌వా? ఎప్ప‌టి నుంచో ప్లానింగ్‌లో ఉన్న ప్ర‌ధానికి భారీగా కొత్త నోట్ల‌ను డంప్ చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.. కానీ, కావాల‌నే నోట్ల పంపిణీలో జాప్యం చేస్తున్నార‌ని తెలుస్తోంది. న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను పెంచాలంటే, నోటుకు తాళం వేయాలి... వాటి పంపిణీలో జాప్యం చేయాలి. అప్పుడే ఆన్ లైన్ మ‌నీ ట్రాన్స్ఫ‌ర్ పెరుగుతుంది. ఆన్ లైన్ లావాదేవీలు పెరుగుతాయి... మోదీకి కావాల్సింది కూడా అదే. అందుకే ఇంత జాప్యం.
 
పెద్దనోట్లను రద్దు చేసి ఇప్పటికి ఇది పద‌కొండు రోజుల దాటిపోయాయి. మరి... పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన మొత్తం ఎంతో తెలుసా? సుమారు నాలుగు లక్షల కోట్లు! అదే సమయంలో బ్యాంకుల ద్వారా ప్రజలకు వచ్చిన మొత్తం రూ.75 వేల కోట్లకు లోపే! టోట‌ల్‌గా జ‌నం సొమ్ము బ్యాంకుల్లో ఇరుక్కుపోయింది. ఎంతైనా బ్యాంకుల్లో జ‌మ చేసుకోవ‌చ్చు... కానీ, తిరిగి తీసుకునేది మాత్రం కొంచెం కొంచెమే! అదే మోదీ మార్కు టెక్నిక్. చివ‌రికి చిరాకు పుట్టి... అంతా చెక్కులు, మ‌నీ ట్రాన్స‌ఫ‌ర్ల తోవ‌కు రావాల్సిందే. 
 
ఈ ఇబ్బందులు కొన్నాళ్లే... అని ప్రధాని మోదీ అన్నారు. రెండు, మూడు వారాలే అని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెబుతున్నారు. కానీ... ‘కరెన్సీ కటకట’ ఇప్పట్లో తీరేది కాదని, ఆరు నెలలకుపైగానే పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ‘నోటు’కు తాళం వేసేదిశగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే... రద్దయిన నోట్లకు సమానంగా కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశమే కేంద్రానికి లేదు. నగదు లావాదేవీలపై పూర్తి స్థాయిలో పట్టు బిగించడం, తద్వారా నల్ల ధనాన్ని నియంత్రించడం ఇందులో అత్యంత కీలకం! అదే సమయంలో... సామాన్య జనం కరెన్సీ కోసం ఇక్కట్లు పడక తప్పదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం వేస్తున్న ఒక్కో అడుగును నిపుణులు విశ్లేషిస్తున్నారు. 
 
ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ప్రజలు సుమారు 4 లక్షల కోట్ల విలువైన 500, వెయ్యి నోట్లను బ్యాంకులకు తిరిగి ఇచ్చేశారు. బ్యాంకుల ద్వారా జనానికి పంపిణీ అయిన మొత్తం కేవలం 75 వేల కోట్లకు లోపే! అంటే... జనం సొమ్ములు భారీ స్థాయిలో బ్యాంకుల వద్ద జమ అయ్యాయన్నమాట. అదే సమయంలో, లక్షలు బ్యాంకుకు జమ చేసిన వారు సైతం వేల కోసం బ్యాంకుల ముందు క్యూల్లో పడిగాపులు కాస్తున్నారు. ‘ఇది పెద్ద నోట్ల రద్దు కాదు. వాటి మార్పిడి మాత్రమే’... అని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్‌ చెప్పారు. 
 
నిజానికి... ఇది పాక్షికంగానే నిజం! ఎందుకంటే... కేంద్రం ‘రద్దు’ చేసిన 500, వెయ్యి నోట్ల విలువ 14,17,950 కోట్లు! ఆర్థిక శాఖ చెబుతున్నట్లు ఇది ‘మార్పిడి’ మాత్రమే అయితే... ఇప్పటికే అందుకు సమానమైన కొత్త నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కానీ, అలా చేయడంలేదు. రూ.14.17 లక్షల కోట్ల విలువైన నోట్లు రద్దుకాగా... కేంద్రం ఇప్పటికి రూ.3 లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు, 750 కోట్ల విలువైన 500 నోట్లు... వెరసి నాలుగు లక్షల కోట్లలోపు కరెన్సీ మాత్రమే ముద్రించింది. ఇంకా... 7 లక్షల కోట్ల విలువైన 2 వేలు, 20వేల కోట్ల విలువైన 500 నోట్లు ముద్రించాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది! కానీ... ఇది ఇప్పటికిప్పుడు జరిగేది కాదని స్పష్టమవుతోంది.
 
మ‌రో 6 నెల‌లు ఇదే దుస్థితి!
రద్దయిన పాత 500 నోట్ల సంఖ్య 1570 కోట్లు! అదే స్థాయిలో కొత్త 500ల నోట్లు ముద్రించేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని అంచనా. కొత్త 500 నోట్ల ముద్రణ ఈనెల 10వ తేదీ నుంచే మొదలైంది. సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లలో పగలూ రాత్రి నోట్లు ముద్రించినా... అవసరమైన మేరకు నోట్లు అందుబాటులోకి రావడంలో ‘జాప్యం’ తప్పదు. ఈ విషయాన్ని మన్మోహన్‌కు సలహాదారుగా వ్యవహరించిన ఆర్థిక నిపుణుడు సౌమిత్రా చౌద‌రి కూడా చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆకస్మికంగా ప్రకటించినదే కానీ... ఆకస్మికంగా తీసుకున్నదేమీ కాదు. ప్రభుత్వం అనుకుని ఉంటే... రద్దు నిర్ణయం అమలులోకి వచ్చేనాటికే కావాల్సినన్ని కొత్త 500 నోట్లను ముద్రించి ఉండేది. కానీ, అలా చేయలేదు. దీనికి వెనుక వ్యూహాత్మక కారణాలున్నాయి. 
 
బ్యాంకులకు వెళ్లిన సొమ్ము సాధారణ రైతులు, కర్షకులు, కార్మికులకు ఎట్టి ప‌రిస్థితుల్లో అంద‌దు. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ‘రుణ పరపతి’లేక ఆగిపోయాయి. తాజాగా వస్తున్న సొమ్ములు ఆ దిశగానే మళ్లే అవకాశముంది. ‘మున్ముందు మరిన్ని చర్యలుంటాయి’ అని ప్రధాని ప్రకటించారు. దీనిని బ‌ట్టి ప్రజలు తాము ఉంచుకునే నగదు నిల్వలపై గరిష్ఠ పరిమితి విధించే అవకాశం ఉంది. ఇక‌ బ్యాంకుల్లోనూ భారీ మొత్తంలో ‘విత డ్రాయల్స్‌’కు అంగీకరించరు. చెక్కులు, డీడీల రూపంలో చెల్లింపులు చేసుకోవాల్సిందే. దీనివల్ల ‘నల్ల లావాదేవీల’లకు చెక్‌ పడుతుంది.
 
మార్కెట్‌లో తగిన స్థాయిలో నగదు చెలామణీలో ఉండదు. దీంతో జనం అనివార్యంగా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌యాక్షన్స్‌పై ఆధారపడాలి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఓ మోస్తరు దుకాణాలు కూడా ‘కార్డులను స్వైప్‌’ చేసే మిషన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మున్ముందు ప్రతి షాపులోనూ స్వైపింగ్‌ మిషిన్లే దర్శనమివ్వనున్నాయి. వెరసి... చిన్నస్థాయి లావాదేవీలు కూడా ‘పన్ను’ కన్నుకప్పలేవన్న మాట! పెద్ద నోట్ల రద్దు వల్ల బ్లాక్‌ మనీ వంద శాతం రద్దు కాకపోవచ్చు. కానీ... 500, వెయ్యి నకిలీ కరెన్సీ మాత్రం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లే. ఇదీ మ‌న ఆర్దిక నిపుణుల టెక్నిక్.