శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (14:59 IST)

గుజరాత్ పోల్స్ : మోడీకి ముచ్చెమటలు పోయిస్తున్న ముగ్గురు కుర్రోళ్లు

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముగ్గురు యువ నేతలు ముచ్చెమటలు పోయిస్తున్నారు. ఈ ముగ్గురూ పట్టుదలలో మోడీకి వారసులుగా గుజరాతీలు చెప్పుకుంటున్నారు.

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముగ్గురు యువ నేతలు ముచ్చెమటలు పోయిస్తున్నారు. ఈ ముగ్గురూ పట్టుదలలో మోడీకి వారసులుగా గుజరాతీలు చెప్పుకుంటున్నారు. ఆ ముగ్గురిలో ఒకరు హార్దిక్ పటేల్. పట్టుమని పాతికేళ్లు లేని యువకుడు. గుజరాత్‌లో అత్యంత శక్తిమంతమైన పటేల్‌ సామాజిక వర్గానికి ఆశాజ్యోతి. రాష్ట్ర జనాభాలో 14 శాతం ఉన్న పటేళ్లకు రిజర్వేషన్లు కావాలని స్వచ్ఛందంగా పెల్లుబికిన ఉద్యమానికి సహజ నాయకుడయ్యారు. హార్దిక్‌ లక్ష్యం ఒక్కటే... తమ డిమాండ్‌ను ఖాతరు చేయని బీజేపీ సర్కారును కూల్చేయడం. కాంగ్రెస్‌ రిజర్వేషన్లు ఇస్తుందా? ఇవ్వదా? అన్నది కూడా ఆయనకు అప్రస్తుతం. నిప్పులు చెరిగే ఆయన ప్రసంగాలు బీజేపీకి పీడకలలు. సెక్స్‌ సీడీల వంటి సమస్యలను కూడా అవకాశాలుగా మలచుకోగలగడం ఆయనకే చెల్లింది.
 
రెండో వ్యక్తి. జిగ్నేశ్‌ మేవానీ. 40 ఏళ్ల న్యాయవాది. దళిత ఉద్యమకారుడు. సౌరాష్ట్రలో నలుగురు దళిత యువకులను గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారనన్న ఆరోపణతో చితకబాదిన ఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రముఖుడయ్యారు. ఉత్తర, మధ్య గుజరాత్‌లో వీరి ప్రాబల్యం అధికంగా ఉంది. అల్పేశ్‌తో పాటు జిగ్నేశ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగారు. వారిద్దరినీ స్థానిక కాంగ్రెస్‌ నాయకత్వం వ్యతిరేకించినా జాతీయ నాయకత్వం పట్టుబట్టి బరిలో దించింది.
 
ఇకపోతే, మూడో వ్యక్తి అల్పేశ్‌ ఠాకూర్‌. 35 యేళ్ల యువకుడు. గుజరాత్‌లో 22 శాతం ఉన్న ఓబీసీ ఠాకూర్‌ నేత. ఇటీవలే కాంగ్రె్‌సలో చేరారు. మద్య నిషేధం అమల్లో ఉన్నా గుజరాత్‌లోని ఓబీసీల్లో మద్యం అలవాటు శ్రుతి మించింది. దానికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమించారు. దాంతో బీజేపీ సర్కారు తేరుకొని రాష్ట్రంలో మద్యం వ్యతిరేక చట్టాలను బలోపేతం చేయాల్సి వచ్చింది. గుజరాత్‌లోని 18,000 గ్రామాల్లో ఐదువేల గ్రామాలు అల్పేశ్‌ నేతృత్వంలోని ఓబీసీ-క్షత్రియ సంఘం ప్రాబల్యంలో ఉన్నాయి. ఆయన కులం మీటింగ్‌ పెట్టి పెద్దల అనుమతి తీసుకొని కాంగ్రె్‌సలో చేశారు.
 
ఈ ముగ్గురు కుర్రాళ్లు గుజరాత్‌ను అప్రతిహతంగా 20 యేళ్లుగా ఏలుతున్న బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అనేక ఎన్నికల యుద్ధాలను గెలిచిన ప్రధాని మోడీకే కొరకరాని కొయ్యగా తయారయ్యారు. నిజానికి 1985లో మోడీ రాజకీయాల్లో అడుగుపెట్టే నాటికి ఈ ముగ్గుర్లో ఒకరు పుట్టనేలేదు. మరొకరు తల్లి పొత్తిళ్లలో ఉన్నారు. ఇంకొకరు బడికి వెళ్తున్నారు. ఆ ముగ్గురే ఇపుడు దేశప్రధానిగా ఎదిగిన ఆయనకు పెద్ద సవాలుగా మారారు. ఒంటిచేత్తో కేంద్రంలో అధికారాన్ని సాధించి... ఇంట గెలిచాం... ఇక రచ్చ గెలుద్దాం... అంటూ విదేశాల్లో తిరుగుతున్న ప్రధానిలో ఈ యువకులంతా కలిసి ఓటమి భయాన్ని రేకెత్తించారు.