సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Updated : బుధవారం, 22 డిశెంబరు 2021 (16:58 IST)

తిరుమల ఉదయాస్తమాన సేవ గురించి విన్నారా? ఎందుకిది వివాదమవుతోంది?

టిటిడి ఏ నిర్ణయం తీసుకున్నా వివాదాలకు దారి తీస్తోంది. టిటిడి నిర్ణయాలను కొందరూ స్వాగతిస్తుంటే.. మరికొందరేమో వివాదాలకు దారి తీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరొకసారి టిటిడి వివాదాల్లో చిక్కుకుందా...?

 
శ్రీవారి ఆలయంలో ఉదయాస్తమాన సేవ టికెట్లను తిరిగి పునరుద్ధరణ చేయాలని టిటిడి నిర్ణయించింది. ఇలా వచ్చిన నిధులను చిన్నపిల్లల ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించేలా ఇటీవల టిటిడి పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే అందుబాటులో ఉన్న ఉదయాస్తమాన సేవా టిక్కెట్లను పారదర్శకంగా భక్తులకు కేటాయించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు తగ్గట్టుగా సాధారణ రోజులలో కోటి రూపాయలు ధర, శుక్రవారం నాడు కోటిన్నరగా టిక్కెటు ధర నిర్ణయించే సూచనలు కనిపిస్తున్నాయంటూ వాదనలు వినిపిస్తున్నాయి.

కలియుగ వైకుంఠ నాధుడైన శ్రీ వేంకటేశ్వరుడుని క్షణకాల దర్శనం కోసం భక్తులు పరితపించి పోతుంటారు. తమ జీవిత కాలంలో ఒక్కసారైనా స్వామి వారి దర్శనం భాగ్యం కలిగితే‌ వారి జీవితం ధన్యం అయినట్లే.. దేశ విదేశాల నుండి భక్తులు తిరుమలకు చేరుకుంటారు. గంటల తరబడి వేచి ఉండి స్వామి‌ వారిని దర్శించుకోనిదే తిరిగి వెళ్ళరు భక్తులు. అలాంటిది స్వామి వారిని కొన్ని నిమిషాల పాటు చూసి తరించే భాగ్యం ఉదయాస్తమాన సేవా టికెట్ల ద్వారా భక్తులకు లభిస్తుంది.

 
ఇక వేకువజామున సుప్రభాతం మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీ వేంకటేశ్వరుని కనులారా తరించే అవకాశం ఉదయాస్తమాన సేవ టిక్కెట్లు కలిగిన భక్తులకు లభిస్తుంది. దీంతో ఉదయాస్తమాన సేవ టిక్కెట్లు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు అంటే నమ్ముతారా.. డబ్బున్న వారైతే సేవా టిక్కెట్ల కోసం పోటీ పడుతుంటారు. టిటిడి ప్రవేశపెట్టిన కొద్ది కాలంలోనే భారీగా ఉదయాస్తమాన సేవ టిక్కెట్లను భక్తులు కొనుగోలు చేయడంతో‌ అటు తరువాత వీటి కేటాయింపును తాత్కాలికంగా నిలిపివేసింది టిటిడి.

 
సామాన్య భక్తులకు దర్శనంలో అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఉదయాస్తమాన సేవా టిక్కెట్లను నిలిపివేసిన టిటిడి.. గతంలో భక్తులకు జారీ చేసిన టికెట్లు కాలపరిమితి ముగిసి పోవడంతో ఖాళీగా ఉన్న టిక్కెట్లను తిరిగి భక్తులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉదయాస్తమాన సేవా టిక్కేట్లను ఓ మంచి ఉద్దేశంతో భక్తులకు కేటాయించేందుకు నిర్ణయించుకుంది టిటిడి.

 
చిన్నపిల్లల ఆసుపత్రి కోసం....   ఈ సేవ ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరుపతిలో టిటిడి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి వినియోగించాలని భావిస్తోంది. గతంలో సాధారణ రోజులలో లక్ష రూపాయలుగా, శుక్రవారం నాడు 5 లక్షల రూపాయలు ఉన్న ఉదయాస్తమాన సేవ టికెట్ల ధర, ఇప్పుడు సాధరణ రోజులలో కోటి రూపాయలుగా, శుక్రవారం నాడు స్వామి వారికి అభిషేక సేవలో పాల్గొనే అవకాశం ఉండటంతో టికెట్ ధరను కోటిన్నరగా నిర్ణయించాలని భావిస్తుంది టిటిడి.. గతంలో భక్తులకు కేటాయించిన టిక్కెట్ల కాలపరిమితి ముగియడంతో ప్రస్తుతం టీటీడీ వద్ద 531 ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. 

 
ఆన్లైన్లో పారదర్శకంగా భక్తులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేయాలని భావిస్తుంది టిటిడి. శ్రీవారి దర్శన టిక్కెట్లు కేటాయించిన తరహాలోనే ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు కేటాయించేలా ఏర్పాట్లు చేస్తుంది టిటిడి. ఇప్పటికే ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు కేటాయింపుపై పాలకమండలి నిర్ణయం తీసుకోవడం ఇందుకు సంబంధిచిన విధివిధానాలు కూడా ఖరారు చేసే భాధ్యత అధికారులకు అప్పగించింది టిటిడి. వీలైనంత త్వరగా టిక్కెట్లు ఆన్లైన్లో‌ ఉంచేందుకు టిటిడి‌ అధికారులు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు కోటి, కోటిన్నర రూపాయల ధర నిర్ణయించినా, టిక్కెట్లు వెంటనే భక్తులు బుక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని టిటిడి అంచనా వేసింది. 

ఉదయాస్తమాన సేవ టిక్కెట్లు కొనుకోలుకు టిటిడి సభ్యులు కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. వీటి ద్వారా టీటీడీకి దాదాపు 600 కోట్ల రూపాయల వరకు నిధులు సమకూరే అవకాశాలు ఉన్నట్లు టిటిడి అధికారులు అంచనాకి వచ్చారు. ఈ నిధులన్ని ఇతరత్ర కార్యక్రమాలకు కేటాయించే అవకాశం లేకుండా టిటిడి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న చిన్నపిల్లల కార్డిక్ హాస్పిటల్ అభివృద్ధికి కేటాయించేందుకు చర్యలు తీసుకుంటుంది టిటిడి. అయితే టిటిడి‌ పాలక మండలి తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా మంది భక్తులు, రాజకీయ‌ నాయకులు స్వాగతిస్తుంటే కొందరు‌ మాత్రం టిటిడి తప్పుడు నిర్ణయం తీసుకుందని‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కిస్కింద్ క్షేత్రానికి చెందిన పీఠాధిపతి గోవిందానంద సరస్వతీ స్వామీ శ్రీవారి ఆలయంలో స్వామి వారి సేవలను భక్తులకు ఉచితంగా దర్శించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

శ్రీవారిని రోడ్డుపై పెట్టి స్వామి సేవలను విక్రయిస్తారా?  ఈ సేవను ఏవిధంగా కోటి రూపాయలకు విక్రయిస్తారని ఆయన ప్రశ్నించారు. శ్రీ వేంకటేశ్వరుడు సేవలు వెల కట్టలేనివని, సేవలను టిక్కెట్ల రూపంలో విక్రయించి దాని ద్వారా వచ్చే నగదును చిన్నపిల్లల ఆసుపత్రికి ఉపయోగించరాదని, ఆసుపత్రి నిర్వహణ పూర్తిగా ప్రభుత్వం భరించాలని గోవిందానందసరస్వతి కోరారు.

 
టిటిడి పాలకమండలి నిర్ణయం పూర్తిగా తప్పుడు నిర్ణయం తీసుకుందని, వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే టిటిడి‌ పాలక మండలి పలుమార్లు నవ్వుల పాలైందని, పాలక మండలి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నిర్ణయం తీసుకుంటుంటే శ్రీవారి ఆలయ పెద్ద జియ్యర్లు, చిన్నజియ్యర్లు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అయితే టిటిడి పాలక మండలి తీసుకునే నిర్ణయాలు ఎక్కడి వరకూ దారి తీస్తాయో వేచి చూడాలి.