ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 జూన్ 2020 (18:23 IST)

దేశానికే ఆదర్శంగా నిలిచిన ధారావి మురికివాడ... ఏ విషయంలో?

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోని ధారావి ప్రాంతం ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా గుర్తింపుపొందింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే అత్యధిక జనసాంద్రత ఉంది. దాదాపు 10 లక్షల మంది కేవలం 25 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణంలో ఇరుకిరుకు గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. అదీకూడా అత్యంత దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. పైగా, కలుషిత వ్యర్థాల మధ్య ఆవాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో 80 మందికి ఒక్కో మరుగుదొడ్డి ఉందంటే అక్కడ పరిస్థితులు ఎంత దుర్భంగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
అలాంటి మురికివాడలోకి కరోనా వైరస్ ప్రవేశించింది. అనేక మంది ఈ వైరస్ బారినపడ్డారు. కానీ, ముంబై నగర పాలక సంస్థ అధికారులు తీసుకున్న ప్రత్యేక చర్యలు, అమలు చేసిన వ్యూహాత్మక ప్రణాళికల పుణ్యమాన్ని ఈ మురికివాడ ఇపుడు కరోనా మహమ్మారి బారి నుంచి విముక్తి పొండమేకాదు.. దేశానికే ఆదర్శంగా నిలిచింది. 
 
ధారావిలో తొలిసారి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. ముంబై నగర పాలక సంస్థ అధికారులు కూడా తీవ్ర ఆందోళన చెందారు. కానీ, బృహన్ ముంబై అధికారులు చేసిన కృషి, పడిన శ్రమ ఫలితాన్ని ఇచ్చాయి. ఇక్కడ ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడమే కాదు... కనిష్టానికి చేరడంతో, ధారావి ప్రాంతం మహమ్మారిని తరిమేసిన మోడల్‌గా నిలిచింది.
 
ధారావిలో కరోనా విజృంభిస్తే, నెల రోజుల వ్యవధిలోనే ముంబైలో దాదాపు 5 లక్షల కేసులు వస్తాయని మార్చిలోనే అంచనా వేసిన అధికారులు, వైరస్ ప్రబలకుండా తమవంతు కృషి చేశారు. 
 
ఇక్కడ నివాసం ఉంటున్న దాదాపు 47,500 కుటుంబాల తలుపులు తట్టారు. అందరినీ పరీక్షించారు. వైరస్ సోకిన వారిని అసుపత్రులకు చేర్చడంతో పాటు, వారికి కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించడం ప్రారంభించారు. ఆ ప్రాంతంలో వైరస్ నివారణా చర్యలు ప్రారంభించారు.
 
ఈ కార్యక్రమం ఏప్రిల్‌ నెలలోనే మొదలుపెట్టారు. ముఖ్యంగా, ధారావిలో తొలి కేసు వచ్చిన తర్వాత, అధికారులు రంగంలోకి దిగారు. దాదాపు 7 లక్షల మందిని అధికారులు స్క్రీనింగ్ చేశారంటే, వారెంత సీరియస్‌గా పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. 
 
వైరస్ లక్షణాలు ఎవరిలో కనిపించినా, వారిని వెంటనే సమీపంలో క్వారంటైన్ సెంటర్లుగా మార్చబడిన స్కూళ్లు, స్పోర్ట్స్ క్లబ్‌లకు తరలించారు. వ్యాధి బారిన పడిన వారికి చికిత్సను అందించారు.
 
దీంతో మే నెల ఆరంభంలో ధారావిలో వచ్చిన కేసుల సంఖ్యతో పోలిస్తే, ఇప్పుడు అదే ప్రాంతంలో వస్తున్న కేసుల సంఖ్య మూడో వంతుకు పడిపోయింది. కరోనా సోకిన వారిలో సగానికి పైగా కోలుకున్నారు. 
 
దేశంలోని మిగతా ప్రాంతాల్లో వైరస్ జాడ లేని చోట కూడా కేసులు వస్తుంటే, ధారావి మాత్రం వైరస్‌ను జయిస్తూ, ముందుకు సాగుతూ, మిగతావారికి ఆదర్శంగా నిలుస్తోంది.
 
దీనిపై ముంబై నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమిషనరు కిరణ్ దిగ్వాకర్ స్పందిస్తూ, 'వాస్తవానికి ఈ ప్రాంతంలో భౌతిక దూరం పాటించడం అసాధ్యం. మాకు మిగిలిన ఒకే ఒక్క అవకాశం వైరస్‌ను వెంబడించడమే. అందుకు తగ్గట్టుగా వ్యూహాలను రచించుకుని ముందుకు సాగాం' అని చెప్పుకొచ్చారు. 
 
వైరస్ తొలి దశలోనే బాధితులను గుర్తించి, ఐసొలేషన్ చేయడం ఫలితాలను ఇచ్చిందని అన్నారు. ఏదిఏమైనా, ధారావి ప్రాంతం ఇప్పుడిప్పుడే వైరస్ నుంచి బయటపడుతూ, మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోందని కరోనాపై జరిగిన యుద్ధంలో ముందుండి పోరాడిన కిరణ్ దిగ్వాకర్ చెప్పుకొచ్చారు.