సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (09:55 IST)

ఇజ్రాయెల్ - పాలస్తీనా దేశాల మధ్య యుద్ధానికి అసలు కారణమేంటి?

israel - palastina
ఇజ్రాయెల్ - పాలస్తీనా దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతుంది. ఇజ్రాయెల్ దేశ జైళ్లలో ఉన్న పాలస్తీనీయులను విడిచిపెట్టేంత వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని హమాస్ సంస్థ ప్రకటించింది. ఈ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా భీకర స్థాయిలో దాడులు చేస్తూ పాలస్తీనాలో మారణహోమం సృష్టిస్తుంది. ఈ క్రమంలో అస్సలు ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న అస్సలు సమస్యను ఓసారి పరిశీలిద్ధాం. 
 
ఇజ్రాయెల్.. యూదుల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన దేశం. ప్రపంచంలో యూదులు ఏ మూలన ఉన్నా సరే వారు తమ పౌరులేనని ప్రకటించిన దేశం. అదేసమయంలో 1920 నుంచి 1940 వరకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యూదులు పాలస్తీనాకు తరలి వచ్చారు. 
 
అయితే, పాలస్తీనాలోని అరబ్బులతో పొసగక ప్రత్యేక దేశం ఏర్పాటుకు ప్రయత్నించారు. దీన్ని స్థానిక అరబ్బులు తీవ్రంగా వ్యతిరేకించారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం కాగా పాలస్తీనాపై బ్రిటన్ పట్టుపెంచుకుంది. ఈ క్రమంలో యూదులకు మాతృభూమిని ఏర్పాటు చేసే బాధ్యత బ్రిటన్ పాలకులపై పడింది.
 
ప్రపంచ దేశాలలో ఉంటున్న యూదులంతా పాలస్తీనాకు తరలిరావడం మొదలు పెట్టారు. ఇది కాస్తా పాలస్తీనాలో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని యూదులు, అరబ్బులకు పాలస్తీనా ప్రాంతాన్ని సమంగా విభజించే ప్రతిపాదన చేసింది. 
 
ఇరు వర్గాలకూ ముఖ్యమైన పవిత్ర జెరూసలెం ప్రాంతాన్ని అంతర్జాతీయ అడ్మినిస్ట్రేషన్ కింద ఉంచాలని చెప్పింది. ఈ సూచనను యూదులు అంగీకరించారు. కానీ, అరబ్బులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఐక్యరాజ్య సమితి ప్రతిపాదన అమల్లోకి రాలేదు. 
 
యూదులు, అరబ్బుల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, పరిస్థితి చేజారిందని భావించిన బ్రిటన్ పాలకులు పాలస్తీనా నుంచి బయటకు వచ్చారు. 1948లో పాలస్తీనా నుంచి బ్రిటన్ వెళ్లిపోయింది. దీనిని అవకాశంగా మలుచుకున్న యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపించుకున్నారు. 
 
యూదులతో జరిగిన పోరాటంలో అరబ్బులు నిలవలేక తమ ఇళ్లూ, వాకిళ్లను వదిలేసి పారిపోయారు. అరబ్బులకు మద్దతుగా పొరుగు దేశాలు జోర్డాన్, ఈజిప్ట్ యుద్ధం చేసినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. 
 
పాలస్తీనాలోని మెజారిటీ భూభాగాన్ని సొంతం చేసుకున్న యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. పాలస్తీనాలో ఇటు జోర్డాన్ కొంత భూభాగాన్ని, అటు ఈజిప్టు మరికొంత భూభాగాన్ని ఆక్రమించాయి. జోర్డాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంక్ అని, ఈజిప్టు స్వాధీనం చేసుకున్న ప్రాంతాన్ని గాజా స్ట్రిప్ అని నామకరణం చేశారు. 
 
ఈ ప్రాంతాల్లో అరబ్బులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. జెరూసలెం ప్రాంతాన్ని పశ్చిమం వైపు ఇజ్రాయెల్ దళాలు, తూర్పు వైపు జోర్డానియన్ దళాలు పంచుకున్నాయి. తమ భూభాగం కోసం అరబ్బులు తరచుగా ఇజ్రాయెల్‌తో పోరాడుతూనే ఉన్నారు.
 
ఈ పోరాటంలో నుంచి హమాస్ మిలిటెంట్లు పుట్టుకొచ్చారు. 1967లో జరిగిన యుద్ధంలో అరబ్బులు తీవ్రంగా నష్టపోయారు. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ ప్రాంతాలు కూడా ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చేశాయి. 2005లో గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి గాజా స్ట్రిప్ పాలన వ్యవహారాలను హమాస్ పర్యవేక్షిస్తోంది. 
 
అయితే, వెస్ట్ బ్యాంక్ మాత్రం ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. దీన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు హమాస్ మిలిటెంట్లు పోరాటం చేస్తున్నారు. ఫలితంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, భీకర దాడులు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా జరిగిందే తాజా దాడులు.