సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్

టీచర్స్ డే : శిథిలావస్థలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చదువుకున్న పాఠశాల

teachers day
ప్రతి యేటా సెప్టెంబరు ఐదో తేదీన గురుపూజోత్సవం జరుపుకుంటారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకను జరుపుకుంటారు. అయితే, ఆయన విద్యాభ్యాసం చేసిన పాఠశాల ఇపుడు శిథిలావస్థకు చేరుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని ఉమ్మడి వేలూరు జిల్లాలోని వాలాజాపేట (ప్రస్తుతం రాణిపేట జిల్లా)లో ఉంది. ప్రస్తుతం ఈ స్కూల్ శిథిలావస్థకు చేరుకుంది. 
 
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పుర స్కరించుకుని మంగళవారం దేశమంతా ఆయన్ని స్మరించుకోనుండగా, ఆయన చదువుకున్న బడి నిర్వహణను మాత్రం పాలకులు విస్మరించారు. ఈ పాఠశాల భవనాలు కూలేందుకు సిద్ధంగా ఉండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజైన సెప్టెంబరు 5వ తేదీని జాతీయ ఉపాధ్యాయదినంగా పాటిస్తున్న విషయం తెలిసిందే. 
 
తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలో ఉన్న సర్వేపల్లి గ్రామంలో 1888 సెప్టెంబరు 5వ తేదీన జన్మించిన రాధాకృ ష్ణన్.. రాష్ట్రంలోని మొట్టమొదటి మున్సిపాలిటీగా పేరొందిన వాలాజాపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. తన మేనమామ ఇంట్లో ఉంటూ ఇదే పాఠశాలలో చదువుకున్నారు. ప్రస్తుతం ఆ పాఠశాల బాలుర మహోన్నత పాఠశాల స్థాయికి చేరింది.
 
ఈ పాఠశాలలో చదువుకున్న వేలాదిమంది విద్యార్థులు దేశవిదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. వారిలో సర్వేపల్లితో పాటు ప్రముఖ కవి ఎం.వరదరాజన్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పద్మనాభన్, కేంద్ర మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ సంపత్ సహా ఇక్కడ చదువుకున్నవారే. 
 
1867లో ప్రారంభమైన ఈ పాఠశాలలో టేకుతో మెట్లు ఏర్పాటుచేశారు. అతి పెద్ద వాణిజ్య పట్టణంగా రాణించిన వాలాజాలో ప్రముఖ వ్యాపారులు తమ పిల్లల్ని ఈ పాఠశాలలోనే చదివించేవారు. 1920వ సంవత్సరం మద్రాస్ ప్రిసీడియం దివాన్ బహదుర్గా, కౌన్సిల్ సభ్యుడిగా వ్యవహరించిన రాజగోపాలాచారి చేపట్టిన ప్రయత్నాల వల్ల ఈ పాఠశాలను 'హెచ్' డిజైన్లో నిర్మించారు. 1949 సంవత్సరంలో జాతీయ జెండాను ఎగురవేసేందుకు అతిపెద్ద స్తంభాన్ని కూడా స్థాపించారు. ఇంతటి ఘన చరిత్ర వున్న ఈ పాఠశాల భవనాలన్నీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. ఏ క్షణంలో ఏ గోడ కూలి పడుతుందోనని విద్యా ర్థులు ఆందోళన చెందుతున్నారు.