సిల్క్ స్మిత కూడా ఉన్న టైమ్ ట్రావెల్ ఫోన్ కాన్సెప్ట్ తో విశాల్ మార్క్ ఆంటోని
విలక్షణమైన సినిమాలు, విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమై తనదైన స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడు విశాల్. ఆయన టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను మినీ స్టూడియో బ్యానర్‌పై అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. వినాయక చవితి సందర్భంగా మార్క్ ఆంటోని మూవీ సెప్టెంబర్ 15న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ను వెర్సటైల్ స్టార్ రానా దగ్గుబాటి విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే..
ఏం బాసూ రెడీయా.. వెల్ కమ్ టు ది వరల్డ్ ఆఫ్ మార్క్ ఆంటోని .. అంటూ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. కొందరు విలన్స్ కత్తులు పట్టుకుని ఎవరినో చంపడానికి పరుగులు తీస్తుంటారు. మరో వైపు ఓ డబుల్ డెక్కర్ బస్‌పైన కూడా కొందరు దాడి చేస్తారు. అప్పుడే ఆంటోని పాత్రను రివీల్ చేశారు. ఓ మహిళతో ఆంటోని పాత్రలోని విశాల్ మాట్లాడుతూ నేను విలన్.. విలన్‌గానే ఉంటాను అంటూ కర్కశంగా చెబుతాడు.
మరో వైపు మంచిలో ఏంట్రా చెడు.. చెడులో ఏంట్రా మంచి అనే విశాల్ కొందరిని ఉద్దేశించి డైలాగ్ చెప్పటం .. ఆంటోని చెడ్డవాడు అని చెబుతూ వచ్చే యాక్షన్ సీక్వెన్సులు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఇక కీలక పాత్రధారి అయిన ఎస్.జె సూర్యతో విశాల్ మాట్లాడుతూ లేడీస్ మ్యాటర్ అని చెప్పగానే తను విలనిజం చూపిస్తూనే పండించిన కామెడీ ఆసక్తికరంగా ఉంది. ఇక సునీల్ పాత్ర మరింత క్యూరియాసిటీని పెంచుతుంది. మన ప్లాన్ ప్రకారం ఆంటోనీని వేసేయాలంటూ సునీల్ చెప్పే డైలాగ్‌తో పాటు తను ముసలి పాత్రలో పంచె ఎగ్గట్టి గన్ తీసుకుని చేసే ఫైట్ చూస్తుంటే తన పాత్రేంత పవర్‌ఫుల్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అప్పుడే అసలు సినిమాలో ట్విస్ట్ ఎలా ఉండబోతుందో ట్రైలర్‌లో టచ్ ఇచ్చారు. చిరంజీవి అనే సైంటిస్ట్ టైమ్ ట్రావెల్ ఫోన్‌ను కనిపెడతాడు. ఆ ఫోన్‌తో గతానికి వెళ్లి మాట్లాడవచ్చునని తెలుసుకున్న విశాల్ క్యారెక్టర్ తన తండ్రికి ఫోన్ చేస్తే ఎస్.జె.సూర్య ఫోన్ తీస్తాడు. ఆ సందర్భంలో విశాల్, ఎస్.జె.సూర్య మధ్య వచ్చే కామెడీ ఆకట్టుకుంటోంది. అసలు ఆ ఫోన్‌తో ఎవరెవరు మాట్లాడారు.. ఏం మాట్లాడారు.. ఫోన్‌లో టైమ్ ట్రావెల్‌ను ఎలా చేశారనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
అలాగే 80-90 దశకంలో ఓ ఊపు ఊపిన సిల్క్ స్మిత పాత్రను కూడా ఇందులో చూపించారు. ఆమె పాత్ర స్పెషల్ సాంగ్‌లో అలరిస్తుందని తెలుస్తుంది.
ఇది మార్క్ సమస్య .. నా బాబు ఆంటోనీని నేనే చంపుతా అని కొడుకు పాత్రలోని విశాల్ చెప్పటం.. తండ్రి పాత్రలో విశాల్ అక్కడ పగలబడి నవ్వటం తో పాటు గుండు లుక్లో స్టైలిష్ విశాల్ లుక్ స్టన్నింగ్‌గా ఉంది.
ఇప్పటి వరకు విశాల్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే మార్క్ ఆంటోని మరో ఎత్తు అనిపిస్తోంది. ఎందుకంటే ఇందులో ఆయన చేసిన క్యారెక్టర్స్‌లోని షేడ్స్ ఇది వరకటి కంటే ఎంతో భిన్నంగా ఉన్నాయి. ఓ వైపు క్రూరమైన విలన్‌గా కనిపిస్తున్నారు. మరో వైపు గుండుతో స్టైలిష్‌గా ఆకట్టుకుంటున్నారు. మరోవైపు తండ్రిని కాపాడుకోవాలనుకునే.. అలాగే చంపాలనుకునే యువకుడిగానూ ఉన్నారు. సాధారణంగా మన ఆడియెన్స్ టైమ్ మిషన్‌ను చూశారు. అందులో మన నాయకానాయికలు గతానికి వెళ్లటమో, భవిష్యత్ కాలానికి వెళ్లటాన్ని చూపించారు. మార్క్ ఆంటోనిలో అలాంటి కాన్సెప్ట్ ఉంది. సునీల్, సెల్వ రాఘవన్ పాత్రలు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఓ టైమ్ మిషన్ కాకుండా ఓ ఫోన్ మన హీరోని గతానికి తీసుకెళ్తే తనేం చేశాడనే కథాంశంతో మార్క్ ఆంటోని సినిమా తెరకెక్కింది. ఇది తండ్రీ కొడుకుల మధ్య సాగే డిఫరెంట్ ఎమోషనల్ మూవీగా ఎంటర్‌టైన్ చేయనుందని ట్రైలర్‌లో తెలుస్తోంది.
ఈ చిత్రానికి సంగీతం జి.వి. ప్రకాష్ అందించారు. యాక్షన్ సన్నివేశాలను పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్ డిజైన్ చేశారు. వెర్సటైల్ డైరెక్టర్, యాక్టర్ ఎస్.జె.సూర్య ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్ కూడా వెరైటీగా ఉంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మూవీపై ఆసక్తిని పెంచాయి. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి.