ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : సోమవారం, 23 జనవరి 2017 (13:44 IST)

జల్లికట్టు ఉద్యమం ఎందుకు హింసాత్మకమైంది.. విద్రోహ శక్తులే కారణమా? విద్యార్థుల తప్పేమీలేదా? ప్లీజ్ గో హోమ్

తమిళ సంప్రదాయంలో ఒకటైన జల్లికట్టుపై నిషేధం విధించడంతో తమిళ రాష్ట్రమంతా శాంతియుతంగా వారం రోజుల పాటు ఉద్యమం చేపట్టింది. ఇందుకు కేంద్రం కూడా దిగొచ్చింది. ఆర్డినెన్స్‌కు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆదివా

తమిళ సంప్రదాయంలో ఒకటైన జల్లికట్టుపై నిషేధం విధించడంతో తమిళ రాష్ట్రమంతా శాంతియుతంగా వారం రోజుల పాటు ఉద్యమం చేపట్టింది. ఇందుకు కేంద్రం కూడా దిగొచ్చింది. ఆర్డినెన్స్‌కు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం మెరీనా బీచ్‌లో ప్రజలు, యువత పెద్ద ఎత్తున గుమికూడారు.

అంతటితో జల్లికట్టు ఉద్యమానికి చరమగీతం పాడివుంటే మంచి జరిగివుంటుందేమోనని సినీ సెలెబ్రిటీలు అంటున్నారు. అయితే ఇంతలో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపు తప్పేలా చేశారు. సోమవారం ఉదయానికి జల్లికట్టు ఉద్యమాన్ని ఆపేయాలని నిర్ణయానికి వచ్చిన ఆందోళన కారులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. 
 
విద్రోహ శక్తులు ఉద్యమంలోకి వచ్చేశాయని మెరీనా తీరాన్ని వీడి విద్యార్థులు ఇంటికి వెళ్లాలని పోలీసులు చెప్పడంతో.. విద్యార్థులు నో చెప్పారు. ఆర్డినెన్స్ వచ్చేదాక శాంతియుతంగా ఉద్యం చేస్తామన్నారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఇక లాభం లేదనుకున్న విద్యార్థులు సముద్రంలో సామూహిక ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. వారిని అడ్డుకోవడంతో పాటు రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఏర్పాట్లు చేసుకోవాలనే ఆదేశాలుండటంతో  పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కానీ పోలీసుల లాఠీ ఛార్జీకి నిరసన ఆందోళన కారులు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించారు. దీంతో జల్లికట్టు ఉద్యమం మరింత ఉధృతంగా మారింది. చెన్నై మెరీనా బీచ్ నుంచి ఉద్యమకారులను ఖాళీ చేయించడంతో ఉద్రిక్తత నెలకొంది. 
 
ఐస్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. నిరసనకారులు పెట్రోల్‌ బాంబులను విసిరారు. కారు, ఆటో సహా 25 వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో రాపిడ్‌యాక్షన్‌ ఫోర్స్‌ రంగంలోకి దిగింది. ఆందోళనకారులపై టియర్‌గ్యాస్‌ పోలీసులు ప్రయోగించారు. ఆందోళన ఉధృతం కావడంతో చెన్నైనగరంలో భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది.
 
దీనిపై సెలెబ్రిటీలు స్పందించారు. పోలీసుల చర్య అమానుషమని.. ఇన్నాళ్లు తమకు సహకరించిన పోలీసులు ఒక్కసారిగా లాఠీఛార్జ్ చేయడంతోనే పరిస్థితి అదుపుతప్పిందని కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ అన్నారు. సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో ఉద్యమాన్ని ఎటు తీసుకెళ్లాలో న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలనుకున్నామని.. అంతలోనే ఇదంతా జరిగిపోయిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు తానే స్వయంగా మెరీనాకు వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. మహిళలు, పిల్లలు సురక్షితంగా ఉండాలని.. విద్యార్థులకు ఆత్మహత్యలకు పాల్పడవద్దని లారెన్స్ కోరారు.
 
మరోవైపు ఆర్డినెన్స్ రావడంతోనే జల్లికట్టు ఉద్యమం ముగిసిందని.. అందుచేత అందరూ ఇంటికి పోవాల్సిందిగా నటుడు ఆర్జే బాలాజీ విద్యార్థులను కోరాడు. జల్లికట్టు ఉద్యమంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతుందని.. అలాంటి పరిస్థితుల్లో అరాచకాలకు పాల్పడటం.. ఇన్నాళ్లు ఉద్యమంలో సహకరించిన పోలీసులపై దాడి చేయడం.. పోలీస్ స్టేషన్‌ను తగలబెట్టడం సరికాదన్నారు. విద్యార్థులు ఇలా చేశారా? ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని తెలియరాలేదని.. అయితే విద్యార్థులు ఇక మెరీనా తీరంలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ప్లీజ్ గో హోమ్.. ఉద్యమం ముగిసిందంటూ ఆర్జే బాలాజీ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. కాగా, హింసాత్మక చర్యల్లో విద్యార్థుల పాత్ర లేదని విద్రోహ శక్తులే కారణమని వార్తలొస్తున్నాయి. అయితే పోలీసులు ప్రభుత్వాధికారుల ఒత్తిడితో విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.