శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్

చరిత్రలో జనవరి 24 : భారత అణుపితామహుడు భాభా చనిపోయినరోజు..

జనవరి 24వ తేదీ భారతదేశ చరిత్రలో చెప్పుకోదగిన రోజు. భారత అణు పితామహుడిగా ప్రసిగ్ధిగాంచిన శాస్త్రవేత్త డాక్టర్‌ హోమీ జహంగీర్‌ భాబా ఇదే రోజున చనిపోయారు. గత 1966లో సరిగ్గా ఇదేరోజున జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు. 
 
అప్పటికి ఆయన వయసు 56 యేళ్ల. ముంబై నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్తున్న విమానం.. యూరప్‌లోని ఆల్ప్స్‌ పర్వత శ్రేణిలో ప్రమాదానికి గురై కుప్పుకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న హోమీ భాభాతోపాటు 117 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఇంతవరకు సమాచారం లేకపోవడం విశేషం. 
 
ముంబైకి చెందిన ప్రసిద్ధ న్యాయవాది జహంగీర్‌ హోర్ముస్‌జీ భాభా, మెహ్రెన్‌ దంపతులకు 1909 అక్టోబర్‌ 30 న హోమీ జహంగీర్‌ భాభా జన్మించారు. ప్రాథమిక విద్యను ముంబైలో చదివిన భాభా.. 15 వ ఏటనే సీనియర్‌ కేంబ్రిడ్జి హానర్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. 
 
గణితంలో మాస్టర్‌ కోర్సు చేసిన భాభా ఒక్కసారిగా తన మనసును న్యూక్లియార్‌ ఫిజిక్స్‌ వైపు మరల్చి 1930 లో న్యూక్లియార్‌ ఫిజిక్స్‌లో డాక్టరేట్‌ అందుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇండియాకు వచ్చిన భాభా.. తిరిగి ఇంగ్లండ్‌ వెళ్లకూడదని నిర్ణయించుకుని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో సీవీ రామన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న భౌతికశాస్త్రం విభాగంలో రీడర్‌గా చేరారు. 
 
ఈ సమయంలో సర్‌ దోరబ్‌ టాటా ట్రస్ట్‌ ఇచ్చే స్కాలర్‌షిప్‌కు ఎంపికవడం భాభా జీవితాన్నే మార్చేసింది. 1941 లో జేఆర్‌డీ టాటా సహకారంతో రాయల్‌ సొసైటీ ఫెల్లోషిప్‌ అందుకున్నారు. అనంతరం మహారాష్ట్రలో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ స్థాపించి పలు అంశాలపై పరిశోధనలు జరిపారు.
 
ట్రోంబేలోని భాభా అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన గౌరవార్థం దీనికి భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని పేరు పెట్టారు. భాతర్‌లో అణ్వాయుధాల అభివృద్ధికి మూలస్తంభంగా చెప్పుకునే టీఐఎఫ్‌ఆర్‌, అఈఈటీ లను భాభా డైరెక్టర్‌గా పర్యవేక్షించారు. భాభా చేసిన సేవలకు గాను ఆడమ్స్ ప్రైజ్ (1942), కేంద్ర ప్రభుత్వంచే పద్మభూషణ్ (1954) లభించింది. 1951, 1953-1956లో భౌతికశాస్త్రం విభాగంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యాడు. 
 
న్యూయార్క్‌కు బయల్దేరడానికి మూడు నెలల ముందు భాభా చేసిన ప్రకటన సంచలనం రేపింది. తనకు అనుమతిస్తే కేవలం 18 నెలల్లోనే ఆటంబాంబును తయారుచేసి చూపిస్తాను అని ప్రకటించారు. అయితే, అణు బాంబు తయారుచేస్తే తమకు ముప్పుగా పరిణమిస్తారన్న భయంతో భాభా ప్రయాణిస్తున్న విమానాన్ని అమెరికాకు చెందిన సీఐఏ అధికారులు కూల్చివేయించారన్న ఆరోపణలు లేకపోలేదు.