సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : ఆదివారం, 25 జూన్ 2017 (13:00 IST)

లోకేష్‌ దూకుడు..! ఏ విషయంలో...

రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దూకుడు పెంచారు. సొంత జిల్లా చిత్తూరుపై దృష్టి సారించాడు. మూడురోజులు సుడిగాలి పర్యటన చేసి అధికారులను పరుగులు పెట్టించారు. తన పరిధిలోని రెండు శాఖలకు సంబంధించిన అన్ని అంశాలపైన

రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దూకుడు పెంచారు. సొంత జిల్లా చిత్తూరుపై దృష్టి సారించాడు. మూడురోజులు సుడిగాలి పర్యటన చేసి అధికారులను పరుగులు పెట్టించారు. తన పరిధిలోని రెండు శాఖలకు సంబంధించిన అన్ని అంశాలపైన అధికారులకు దిశానిర్ధేశం చేశారు. విధి నిర్వహణలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఇంటికి పంపిస్తామంటూ హెచ్చరికలు చేశారు. లోకేష్ స్పీడ్ పెంచడం వెనుక ఆంతర్యమేమిటి...
 
లోకేష్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి చోటా అబాసుపాలు అవుతున్నారు. మాట్లాడడంలో మొదట తడబడిన లోకేష్‌ తరువాత వాటిని క్రమక్రమంగా చక్కదిద్దుకుంటున్నారు. తన చేష్టల ద్వారా పలు సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్న లోకేష్‌ వాటిని కూడా సరిదిద్దుకున్నారు. జగన్‌కు అనేకసార్లు సవాళ్ళు విసురుతూ ప్రెస్‌మీట్లు పెట్టిన లోకేష్‌ రాజకీయ ఎదుగుదలకు అదే ఉపయోగపడుతుందని భావించారు. 
 
కానీ తన మాటలను పక్కనబెట్టి చేతలతో సమాధానం చెప్పాలనుకున్నాడు. అందుకే మంత్రిగా తానేంటో నిరూపించుకోవాలని తహతహలాడుతున్నాడు. మొక్కుబడి సమీక్షలతో ఇంతకాలం నెట్టుకొచ్చిన లోకేష్‌ ఇప్పుడు గ్రౌండ్ లెవల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సమాయత్తమవుతున్నాడు. అందుకు చిత్తూరు జిల్లాలో మూడురోజుల పాటు చేసిన పర్యటనే నిదర్శనం. 
 
ముఖ్యంగా గ్రామీణాభివృద్థిలో కీలకభూమిక పోషించిన పంచాయతీరాజ్ శాఖ‌కు లోకేష్‌ మంత్రిగా ఉన్నాడు. ఆ శాఖ అధికారులందరినీ గ్రామాల బాట పట్టించి మూడురోజుల్లో అనేక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాడు. అంతేకాకుండా సమస్యలను గుర్తించడంలోగానీ వాటిని పరిష్కరించడంలోగానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంత పెద్ద అధికారినైనా ఇంటికి పంపుతానంటూ ఆదేశాలు జారీ చేశారు. 
 
మాటల ద్వారా కాకుండా చేతల ద్వారానే సమాధానం చెప్పాలనుకుంటున్న లోకేష్‌ పనిలో పదును పెంచాడు. ఆయన బాధ్యత వహిస్తున్న శాఖల్లో సమూల ప్రక్షాళన చేసే విధంగా ముందుకు వెళుతున్నారు. మంత్రిగా పూర్తిస్థాయిలో తన సమర్ధతను నిరూపించుకుంటున్న పార్టీ నాయకుడిగాను, రాష్ట్ర నాయకుడిగాను ఎదగగలడన్న భావనకు వచ్చారు లోకేష్‌. అందులో భాగంగానే సరికొత్త మార్గంలో దూసుకెళుతున్నారు.