శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (10:28 IST)

పవన్‌కు నితిన్ రూ.25లక్షల విరాళం.. బాబాయ్ కోసం అబ్బాయ్ ఏం చేస్తాడంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఎన్నికల నేపథ్యంలో కుటుంబీకులు, బంధువులతో పాటు అభిమానుల మద్దతు భారీగా వుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో మెగా ఫ్యామిలీ నుంచి కీలక స్టార్లు పాల్గొన్నారు. అలాగే ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పవన్‌కు మద్దతివ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి సినీ హీరో నితిన్ భారీ విరాళాన్ని ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కు నితిన్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేనకు తన వంతు సాయంగా రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. సోమవారం రాత్రి భీమవరంలో పవన్ కల్యాణ్‌ను నితిన్, అతని తండ్రి, సినీ నిర్మాత సుధాకర్ రెడ్డి కలిశారు. డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న పవన్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా రూ. 25 లక్షల చెక్‌ను అందించారు. తనపై ఎంతో అభిమానం చూపిన నితిన్, సుధాకర్ రెడ్డిలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. 
 
ఇకపోతే.. జనసేన తరపున పవన్ కళ్యాణ్‌కు జబర్దస్త్ టీమ్ మద్దతు ప్రకటించింది. ఇక మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ తేజ్, బన్నీ, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్, నిహారికలు జనసేన మద్దతు ప్రకటించగా.. వరుణ్ తేజ్‌తో పాటు నిహారిక ఇప్పటికే జనసేన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే బన్నీ జనసేనకు మద్దతు ప్రకటించినా ప్రచారంలో పాల్గొనలేనని తేల్చేశారు. ఇక చిరంజీవి ‘సైరా’ షూటింగ్‌తోనే గడిపేస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 
 
కాగా.. జనసైనికుల్లో ఉత్సాహం నింపేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాబాయ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది.   పవన్ నుండి పిలుపు రావడంతో గాజువాక, భీమవరం, నరసాపురం నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.