శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (15:45 IST)

పళని స్వామి సీఎం ఐతే చిన్నమ్మ చేతిలో కీలుబొమ్మే.. పన్నీర్ రాజీనామా వెనక్కి తీసుకోవచ్చట..!?

తమిళనాట రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభానికి ఇప్పట్లో తెరపడే అవకాశం కనిపించేట్లు లేదు. కేంద్రం ఇచ్చే సలహాలతో అటూ వెళ్లలేక ఇటూ వేళ్లలేక ఇన్‌ఛార్జ్ విద్యాసాగర్ ‌రావు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అయిత

తమిళనాట రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభానికి ఇప్పట్లో తెరపడే అవకాశం కనిపించేట్లు లేదు. కేంద్రం ఇచ్చే సలహాలతో అటూ వెళ్లలేక ఇటూ వేళ్లలేక ఇన్‌ఛార్జ్ విద్యాసాగర్ ‌రావు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అయితే చిన్నమ్మ మాత్రం సుప్రీం కోర్టు తీర్పు వచ్చాక.. చాలా తెలివిగా వ్యవహారించారు. తొలుత పన్నీర్ సెల్వాన్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. తర్వాత తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన పళనిస్వామిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆయనే అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శిగా కొనసాగుతారు.
 
ఒకవేళ పళనిస్వామి ముఖ్యమంత్రి అయితే ఆయన చిన్నమ్మకు కీలుబొమ్మ అవుతారు. శశి జైలు నుంచే ఈజీగా పరిపాలన సాగించవచ్చు. శశికళకు జైలు శిక్ష పడడంతో పన్నీర్ సెల్వానికి కాస్త ఊరట లభించింది. ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకునేందుకు అవకాశం వచ్చింది. విబేధాలను విడనాడి అందరం కలిసి పనిచేద్దామని ఆయన ఇప్పటికే పిలుపు ఇచ్చారు. ఆయన ప్రజాధారణ ఉన్ననాయకుడుగా పేరుపొందే అవకాశం ఉంది. 
 
తమిళనాడులో అమ్మ పాలనే జరుగుతుందని.. అందరూ కలిసి పనిచేద్దామని ఇప్పటికే పిలుపునిచ్చారు. కానీ శశివర్గం మాత్రం చిన్నమ్మ కోసమే ఉంటామంటూ పట్టుబడుతున్నారు. కానీ శశివర్గం నుంచి 11 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ వైపునకు వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది.
 
అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం గతవారం రోజులుగా సాగుతున్న ఉత్కంఠ పోరాటం నుంచి శశికళ ఔట్ కావడం కాస్త ఊరట నిచ్చినా.. శశికళ వెళ్తూ వెళ్తూ.. ఆమె వర్గంలో విషం చల్లిపోయిందని.... పక్కా ప్లాన్ ప్రకారం వ్యూహం రచించిందని రాజకీయ పండితులు అంటున్నారు. పన్నీరుపై పట్టువదలని శశికళ తాను జైలుకు వెళ్తూ.. కొత్త మనిషి పళనిని రంగంలోకి దింపారు. 
 
అయితే.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం తన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని సంకేతాలు ఇస్తున్నారు. అయితే పన్నీర్ సెల్వం లీగల్ గా తన రాజీనామాను వెనక్కి తీసుకోవచ్చా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొన్ని పరిస్థితుల్లో రాజీనామాను వెనక్కి తీసుకోవచ్చని న్యాయనిపుణులు సూచిస్తున్నారు. మొత్తం మూడు రకాల పరిస్థితుల్లో గవర్నర్, ముఖ్యమంత్రి రాజీనామా విత్ డ్రాను ఆమోదించవచ్చని కొందరు మాజీ జడ్జిలు పేర్కొంటున్నారు.
 
మోసం, బలవంతం లేదా అనుచిత ప్రభావంతో ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తే, దాన్ని మళ్లీ వెనక్కి తీసుకోవడం కుదురుతుందని న్యాయనిపుణులు సలహా ఇస్తున్నారు. ఇందులో రెండో రకానికి చెందిన పన్నీర్ రాజీనామాను వెనక్కి తీసుకుంటే.. ఇక ఎమ్మెల్యేల బలం ఆయనకు వచ్చేసినట్టే. శశివర్గానికి తగిన బుద్ధి చెప్పినట్లే. మాఫియాను తన వెంటబెట్టుకుని.. దివంగత ముఖ్యమంత్రి జయలలితను కీలుబొమ్మగా మార్చి ఆడుకున్న శశికళకు సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలకు ప్రజల మద్దతు తప్పకుండా ఉండదని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇప్పటికే శశివర్గం నుంచి ప్రజల పక్షాన నిలబడే నేతకు అండగా నిలిస్తే మంచిదని లేకుంటే సోషల్ మీడియా ద్వారా ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు వారి వారి నియోజక వర్గాలకు వెళ్ళలేరని వారు సూచిస్తున్నారు. శశికళ చెప్పిన వ్యక్తి సీఎం అయితే ఇక తమిళనాడు మాఫియా రాజ్యం, అవినీతి రాజ్యం తప్పదని.. చిన్నమ్మ చెప్పినట్లే పళని సామి అంతా చేస్తారని వారు చెప్తున్నారు. 
 
ఇకపోతే.. ఒక వేళ పన్నీర్ సెల్వం రాజీనామాను వెనక్కి తీసుకోవాలంటే.. తనను బలవంతం మీద ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారని నిరూపించుకోవాలని మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి ఒకరు తెలిపారు. అయితే శశికళ వర్గంలోని ఓ వ్యక్తిని అధికార పార్టీకి కొత్త నేతగా ఎన్నుకుంటే, ఆ సమయంలో మెజార్టీని ఇరు వర్గాలు నిరూపించుకునేందుకు గవర్నర్ పిలుపునిచ్చే అవకాశముంటుంది. ప్రస్తుతం తమిళనాడులో ఇదే పరిస్థితి నెలకొంది. 
 
శశికళ వర్గం పళనిస్వామిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ విషయంపై గవర్నర్ ఏం చెబుతారా? అనేది ఉత్కంఠగా మారింది. ఇదే పరిస్థితి 1984 ఎన్ టీ రామారావును ముఖ్యమంత్రిగా తొలిగిస్తూ నాదెళ్ల భాస్కర్ రావును సీఎంగా నియమించిన సందర్భంలో ఎదురైంది. సీఎం పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబాటు చేసిన రోజు తనని బలవంతంగా రాజీనామా చేయించినట్లు వెల్లడించారు. 
 
ఇకపోతే.. చిన్నమ్మ పోతూపోతూ చిచ్చు పెట్టి వెళ్ళిందని.. ఇదే తరహాలోనే జయలలితను శశికళ స్నేహం పేరుతో ఆటాడుకుందని రాజకీయ పండితులు అంటున్నారు. చిన్నమ్మ తెలివి కారణంగానే జయలలిత గట్స్ ఉన్న నేతగా పేరుతెచ్చుకున్నా.. చివరి రోజుల్లో ఇబ్బంది పడాల్సి వచ్చిందని వారు చెప్తున్నారు. జయలలితను కుటుంబ సభ్యులను కలవనీయకుండా.. పోయెస్ గార్డెన్‌ను శాసించిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.