మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: శనివారం, 23 జూన్ 2018 (18:00 IST)

తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేసి జె.సి. ఎన్నిసార్లు ఏవిధంగా తిట్టాడో చూడండి..?

తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి మాట్లాడే తీరు చూస్తే…. ఎప్పుడో విడుదలై సంచలన విజయం సాధించిన ప్రతిఘటన సినిమాలో విలన్ చరణ్ రాజ్ చెప్పే డైలాగులు గుర్తుకొస్తాయి. చరణ్ రాజ్ వల్ల అవమానాలకు గురైన హీరోయిన్ విజయశాంతి ఆ తర్వాత

తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి మాట్లాడే తీరు చూస్తే…. ఎప్పుడో విడుదలై సంచలన విజయం సాధించిన ప్రతిఘటన సినిమాలో విలన్ చరణ్ రాజ్ చెప్పే డైలాగులు గుర్తుకొస్తాయి. చరణ్ రాజ్ వల్ల అవమానాలకు గురైన హీరోయిన్ విజయశాంతి ఆ తర్వాత అతని పక్షాన చేరి, అతన్ని పొగుడుతున్నట్టే పొగుడుతూ తిడుతూ వుంటుంది. ఎన్నికల సభలో ఆమె మాట్లాడే తీరును చూసి విలన్‌కి అనుమానం వస్తుంది… ఇది నన్ను పొగుడుతోందా…. తిడుతోందా… అని పక్కనున్న కోట శ్రీనివాసరావును అడుగుతాడు. దానికి కోటా… ఒక డైలాగు చెప్పినప్పుడు పొగుడుతోంది… పొగుడుతోంది… అని అంటాడు. ఇంకో డైలాగ్ చెప్పినప్పుడు తిడుతోంది… తిడుతోంది… అని వ్యాఖ్యానిస్తుంటాడు. 
 
ఇప్పుడు చంద్రబాబుదీ అదే పరిస్థితి. దివాకర్ రెడ్డి ఉపన్యాసం వింటే చంద్రబాబును ఒకపక్క పొగుడుతున్నట్లు, ఇంకోపక్క తిడుతున్నట్లు అనిపిస్తుంది. కడప ఉక్కు పరిశ్రమ కోసం నిరాహార దీక్ష చేస్తున్న సీఎం రమేష్ సభలో గురువారం నాడు జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ… ఇలాంటి దీక్షల వల్ల స్టీల్ ప్లాంటు రాను గాక రాదు… ఈ పెద్ద మనిషి పిచ్చిపట్టి దీక్ష చేస్తున్నారు. ఈ పెద్ద మనిషి దీక్ష చేస్తే ఉక్కు రాదు తుక్కు రాదు… అని వ్యాఖ్యానించారు.
 
సిఎం చంద్రబాబు తక్కువోడు కాదు… నాటకాలు, డ్రామాలు, మాటలు, కుయుక్తులు అన్నీ తెలుసు… ఇలాంటి వ్యక్తి కాబట్టే ఆంధ్రకి ఏదైనా చేస్తే లెక్కచెయ్యడని తెలిసే మోదీ ఏమి చెయ్యడం లేదు… అన్నారు. నరేంద్ర మోడీ ఆంధ్రకు ఏమీ చెయ్యడు… మూడున్నరేళ్ల కిందటే సిఎంకు చెప్పాను… కానీ నీకు తెలియదులే దివాకర్ అన్నాడు. ఇప్పుడు ఆయనకే అర్థమవుతోంది…. అన్నారు. ఈ మాటల అర్థం చంద్రబాబు నాయుడును పొగిడినట్టా… విమర్శించినట్లా? అంటూ చెప్పుకున్నారు.
 
ఇక మహానాడులో జెసి మాట్లాడిన మాటలూ ఇలాగే ఉన్నాయి. తాడిపత్రిలో మీరు సీట్ ఇచ్చినా గెలుస్తా… ఇవ్వకపోయినా గెలుస్తా… పదవి కోసం తెలుగుదేశంలో చేరలేదు… అని సిఎం ఎదుటే అన్నారు. ఒకప్పుడు మీరు వ్యవసాయం ఫలప్రదం కాదని అన్నారు. ఆ తర్వాత తెలుసుకుని సాగు ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు… అంటూ చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగ అన్నారని సర్వత్రా ఉన్న విమర్శలో వాస్తవం ఉందనేలా మాట్లాడారు. 
 
మీరు పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు… ఇంకా మీకు పదవిపై ఆశ పోలేదా… మీరు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి… అని మరో వ్యాఖ్య చేశారు. ఇంకా జన్మభూమి గురించి మాట్లాడుతూ… ఆ కమిటీలు కొంప ముంచేస్తున్నాయి. మీరు మార్చుకోండి… అని అన్నారు. జన్మభూమి కమిటీలు పైన ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు నాయుడు పట్టించుకున్న దాఖలాలు లేవు. 
 
అదే విషయాన్ని జెసి దివాకర్ రెడ్డి మహానాడులో నిష్కర్షగా చెప్పేసారు. ఇక సీఎం టెలికాన్ఫరెన్స్‌ల గురించి మాట్లాడుతూ… మీరు కలెక్టరు, ఆర్డిఓ, ఎంఆర్ఓ, ఆఖరికి ప్యూన్‌తో కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టేస్తున్నారు… ఒక్కడూ మా మాట వినడం లేదు… ముందు ఆ పద్ధతి మార్చుకోండి… అని మనసులోని మాటను బయటపెట్టారు. మిమ్మల్ని అందరికన్నా ఎక్కువగా విమర్శించేది నేనే… అందరూ మీకు చప్పట్లు కొట్టేవాళ్ళు తప్ప మీ దగ్గరికొచ్చి చెప్పేవాళ్ళు ఉండరు. నేను చెప్పిన విషయాలన్నీ సరి చేసుకోండి.. అంటూ ముఖ్యమంత్రికి బోధ చేశారు.
 
మహానాడులో వైఎస్ జగన్ పైన విమర్శలు చేయడం వల్ల మీడియా దాని మీద దృష్టి సారించింది తప్ప… చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల గురించి పట్టించుకోలేదు. ఏ సందర్భంలో చూసినా జె.సి. దివాకర్రెడ్డి మాట్లాడుతున్న తీరు… ఇలాగే ఉంటోంది. మరి ఆయన పొగుడుతున్నారో తెగుడుతున్నారో చంద్రబాబు నాయుడే తేల్చుకోవాలి.