సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (09:01 IST)

'శ్రీనూ! అన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా?' గంటాకు బాబు ఫోన్

సొంత నియోజకవర్గమైన భీమిలి ప్రజల్లో తనపై అసంతృప్తి ఉందని వార్త రావడంతో గత మూడ్రోజులుగా ముభావంగా ఉంటూ.. ఎవరికీ అందుబాటులో లేకుండాపోయిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి

సొంత నియోజకవర్గమైన భీమిలి ప్రజల్లో తనపై అసంతృప్తి ఉందని వార్త రావడంతో గత మూడ్రోజులుగా ముభావంగా ఉంటూ.. ఎవరికీ అందుబాటులో లేకుండాపోయిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి బుజ్జగించారు. పత్రికల్లో రకరకాల సర్వేలు వస్తుంటాయని, వాటిని మనసులో పెట్టుకోకుండా మన పని మనం చేసుకోవాలని సూచన చేసినట్టు తెలుస్తోంది.
 
ఒక సర్వేలో భీమిలి నియోజకవర్గంలో గంటా కొంత వెనుకబడి ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సర్వే ప్రచురితమయ్యాక మంత్రి అసంతృప్తికి లోనయ్యారు. దీంతో ఆయన అమరావతిలో జరిగిన కేబినెట్ మీటింగ్‌కు కూడా దూరంగా ఉన్నారు. పైగా, ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఫలితంగా చంద్రబాబు రంగంలోకి దిగి గంటాకు ఫోన్ చేసి అనునయించినట్టు టీడీపీ వర్గాల సమాచారం. 'శ్రీనూ! అన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా? రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేక విషయాలు మన చుట్టూ తిరుగుతుంటాయి. నా మీద కూడా రోజూ రకరకాల వార్తలు వస్తుంటాయి. ఏవేవో సర్వేలు వేస్తుంటారు. అవన్నీ పట్టించుకుంటే నేను పనిచేయలేను అని చెప్పారు. 
 
అంతేకాకుండా, ఇప్పుడు ఈ సర్వేలో కూడా నా పనితీరు బాగోలేదని కొన్ని నియోజకవర్గాల్లో అభిప్రాయపడినట్లు వేశారు. వాటిని ఫీడ్‌బ్యాక్‌గా తీసుకుని ముందుకు వెళ్తుండాలి. నన్ను దులిపేస్తూ పత్రికల్లో పలు వ్యాసాలు వచ్చిన సందర్భాలున్నాయి. ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేక కథనాలు రాస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ సహజం. కలిసికట్టుగా ముందుకు సాగాలని, అలా ముభావంగా ఉండొద్దని గంటాకు హితవచనాలు చెప్పినట్టు సమాచారం.