శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 19 జూన్ 2018 (15:37 IST)

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాబు సర్కారు సలహాదారు పరకాల షాక్...

ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ లేఖ రాశారు. యథాతథంగా ఆ లేఖ... ''గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పరకాల ప్రభాకర్ నమస్కారములు.

ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ లేఖ రాశారు. యథాతథంగా ఆ లేఖ...
 
''గౌరవ ముఖ్యమంత్రివర్యులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, 
పరకాల ప్రభాకర్ నమస్కారములు.
 
గత కొన్ని రోజులుగా విపక్షానికి చెందిన కొంతమంది నాయకులు నేను ప్రభుత్వంలో సలహాదారు బాధ్యతలలో ఉండడాన్ని పదే పదే ఎత్తిచూపుతున్నారు. ఒక ప్రక్క మీరు భారతీయ జనతా పార్టీతోనూ, కేంద్ర ప్రభుత్వంతోనూ రాష్ట్ర హక్కుల సాధన విషయంలో విభేదించి పోరాడుతూ, మరోపక్క నన్ను సలహాదారుగా పెట్టుకోవడమేమిటని వేలెత్తి చూపుతున్నారు. ఇప్పుడు మీ నాయకత్వంలో కేంద్రంపై, బీజీపీపై జరుగుతున్న ధర్మపోరాటం మీద ప్రజలలో అనుమానాలు లెవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంలో నా ఉనికిని మీ చిత్తశుద్దిని శంకించడానికి వాడుకుంటున్నారు.
 
గత రెండు, మూడు రోజులుగా కొంతమంది అమాంబాపతు నాయకులు ఇటువంచి మాటలు మాట్లాడితే నేను వాటికి అంత ప్రాధాన్యతనివ్వక్కరలేదని నా మిత్రలన్నారు. కాని, ఈరోజు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుని స్థానంలో ఉన్న శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విషయాన్ని లేవనెత్తి మీరు చేస్తున్న పోరాటాన్ని, మీ చిత్తశుద్దిని శంకించేలా మాట్లాడారు. ఇది నన్ను బాగా బాధించింది.
 
నా వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు రాజకీయ ప్రయోజనాలనూ, ప్రాతిపదికనూ ఆపదించ పూనుకోవడం, వాటిని తెరవెనుక మంతనాలకు బేరసారాలకూ మీరు వినియోగిస్తారని ఆరోపించడం ప్రతిపక్ష నాయకుల నీచస్థాయి ఆలోచనలకు తార్కాణం.
 
నా కుటుంబంలోని వ్యక్తులు వేరొక పార్టీలో ఉన్నందు వల్ల, నాకన్నా భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందు వల్ల మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడతాను అని కొందరు ప్రచారం చేయడం మెుదలు పెట్టారు. ఈ మాటలు కూడా నన్ను చాలా బాధిస్తున్నాయి.
 
పరిణతి చెందిన వ్యక్తులు ఎవరి రాజకీయాభిప్రాయాలకు వారు నిబద్దులై ఉండగలరనీ, వారి వారి అభిప్రాయాల పట్ల వారికున్న అంకిత భావానికి అడ్డు రాలేవనే ఇంగితం కూడా వీరికి భగవంతుడు ప్రసాదించకపోవడం దురదృష్టకరం.
 
నేను ప్రభుత్వంలో కొనసాగడం వల్ల రాష్ట్ర హక్కుల సాధనకు మీరు చేపట్టిన ధర్మపోరాట దీక్షమీదా, మీ చిత్తశుద్ది మీదా నీలినీడలు పడకూడదని నా కోరిక. నా వల్ల మీకూ ప్రభుత్వ ప్రతిష్టకూ నలుసంతయినా నష్టం జరగరాదని నా దృడ అభిప్రాయం. అందుచేత నేను ప్రభుత్వ సలహాదారు బాధ్యతలనుండి వైదొలగాలని నిశ్చయించుకున్నాను. 
 
ఈ విషయం నేను రాత్రి మీకు తెలియచేసినపుడు మీరు నా రాజీనామా అభ్యర్ధనను నిర్ద్వేంద్వంగా తిరస్కరించారు. నా పట్ల మీకు పూర్తి నమ్మకం ఉన్నదనీ, సంస్కారహీనులు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల సాధన కోసం ఆడిన తప్పుడు మాటలు నేను పట్టించుకోవద్దని పదే పదే చెప్పారు. అది మీ పెద్దమనసుకు తార్కాణం.
 
ఈ విషయం నేను బాగా లోతుగా ఆలోచించాను. మీ మీదా, ప్రభుత్వం మీదా బురద జల్లడానికి, లేనిపోని ఆరోపణలు చెయ్యడానికి నా పేరూ, నా కుటుంబ సభ్యుల పేర్లూ ఎవ్వరూ వాడుకోకుడదు. ప్రభుత్వంలో నా ఉపస్థితి మీ చిత్తశుద్దిని శంకించడానికి కాకూడదని నా మనస్సాక్షి బలంగా చెపుతోంది. అందుచేత మీ మాటను కాదనాల్సి వస్తోంది. నా రాజీనామాను ఆమోదించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాను.గత నాలుగు సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సేవచేసుకునే భాగ్యాన్ని కలుగచేసినందుకు నేను మీకు సర్వదా కృతజ్ఞుడనై ఉంటాను.
 
త్వరలోనే మిమ్మిల్ని స్వయంగా కలుసుకుంటాను." అని పరకాల తన లేఖలో రాశారు.