శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 23 జూన్ 2018 (09:05 IST)

ఉక్కూ రాదు. తుక్కూ రాదు.. దీక్షలతో ఆరోగ్యం పాడవడమే : జేసీ దివాకర్

విభజన హామీ మేరకు కడపకు ఉక్కు పరిశ్రమను కేటాయించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేపట్టిన దీక్షపై టీడీపీ సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విభజన హామీ మేరకు కడపకు ఉక్కు పరిశ్రమను కేటాయించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేపట్టిన దీక్షపై టీడీపీ సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీక్షల వల్ల ఆరోగ్యం పాడవడమేగానీ, ప్రధాని నరేంద్ర మోడీ జీవించివున్నంత కాలం ఉక్కు రాదు.. తుక్కు రాదు అని అన్నారు. అందువల్ల తక్షణం దీక్ష విరమించాలని ఆయన సూచించారు.
 
కడప ఉక్కు పరిశ్రమ సాధనలో భాగంగా, నగరంలోని జడ్పీ ఆవరణలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు శుక్రవారం 12 మంది ఎంపీలు విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జేసీ చేసిన వ్యాఖ్యలు ఇటు పార్టీలోనూ, అటు ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 
 
'నా మిత్రుడు సీఎం రమేశ్‌ దీక్ష చేస్తున్నాడని వచ్చిన నేను.. ఆయన్ను అభినందించేందుకు మాత్రం రాలేదు. రమేశ్‌.. ఎందుకు నాయనా.. ఈ నిరాహార దీక్ష..! నా మాట విను. ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటావు..? ఇప్పటికైనా దీక్ష విరమించు.. ఉక్కు పరిశ్రమ వస్తుందనుకుంటున్నారా..? మోడీ బతికినంత కాలం ఇవ్వడు.. ఇవాళ పాలకులు ఎలా ఉన్నారంటే. దున్నపోతు మీద వర్షం పడినట్లుగా.. పాలిస్తున్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు విభజన వద్దని మొత్తుకున్నా ఆనాటి పాలకులు విన్నారా.. ఇదీ అంతే. నువ్వెన్ని రోజులు కూర్చున్నా ఏదీ రాదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నాడు సత్యాగ్రహం చేసి బంద్‌లు పాటించాం. ఆనాటి ప్రభుత్వాలు వేరు, నేటి ప్రభుత్వం వేరన్నారు. 
 
కేంద్రం వ్యవహారం చూస్తే ఉక్కు రాదు.. తుక్కు రాదు.. ఏదీ రాదు.. మేం చచ్చిపోతామన్నా పట్టించుకునేవారే లేరు. ప్రధాని మోడీలో ఈర్ష్య, ద్వేషం, పగ అన్నీ పెరిగాయి. చంద్రబాబు.. మోడీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశారు. చంద్రబాబు ప్రధాని కావాలని మనం కోరుతుంటే ఆయనేమో ఏపీ తప్ప మరే పదవి వద్దని.. ఏపీలోనే ఉంటానని చెబుతున్నారు' అంటూ జేసీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు అటు టీడీపీ శ్రేణుల్లోనూ, ఇటు రాష్ట్ర ప్రజల్లనూ చర్చనీయాంశంగా మారాయి.