1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : గురువారం, 7 జులై 2016 (14:35 IST)

శ్రీకాళహస్తిలో వెండి నాగపడగలను అమ్మేస్తున్నారు...!

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు-కేతు పూజల్లో వినియోగించే నాగపడగల తయారీకోసం కొనుగోలు చేసిన వెండిలో అవినీతి జరిగిందని, గుట్టలుగా పేరుకుపోయిన పడగలను కరిగిస్తే అక్రమాలు బయటికొస్తాయని చాలా రోజు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు-కేతు పూజల్లో వినియోగించే నాగపడగల తయారీకోసం కొనుగోలు చేసిన వెండిలో అవినీతి జరిగిందని, గుట్టలుగా పేరుకుపోయిన పడగలను కరిగిస్తే అక్రమాలు బయటికొస్తాయని చాలా రోజులుగా వూదరగొడుతున్నారు. అయితే నాగపడగలు కరిగినా, అక్రమార్కుల పాపం పండే సూచనలు కనిపించడం లేదు. ఒకవేళ కాస్తోకూస్తో ఏదైనా తేల్చగలిగినా..అది న్యాయస్థానాల దాకా నిలబడే అవకాశాం లేదు. కరిగిస్తున్న వెండిని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప అక్రమాలు నిగ్గు తేల్చడానికి వీలుకాకపోవచ్చు.
 
ఎందుకంటే.. దాదాపు 15 యేళ్ళుగా ఆలయంలో పేరుకుపోయిన నాగపడగలను హైదరాబాద్‌లోని ప్రభుత్వ మింట్‌కు తరలించి కరిగిస్తున్నారు. ఈ ప్రక్రియ నెలల తరబడి కొనసాగుతోంది. మొదట్లో 9,873 కిలోలు పంపారు. తాజాగా మరో 5,400 కిలోలు పంపారు. అంటే 15,273 కిలోలు కరిగిస్తున్నారన్నమాట. ఈ 15 యేళ్ళలో పనిచేసిన కార్యనిర్వహణాధికారుల్లో కొందరు నాగపడగల తయారీ కోసం తక్కువ నాణ్యత కలిగిన వెండి కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీన్ని నిగ్గుతేల్చడం కోసం ఈఓల వారీగా వారివారి హయాంలో పోగయిన నాగపడగల వేర్వేరు లాట్లుగా చేసి మింటుకు పంపించారు. కరిగింపు పూర్తయితే లాట్లవారీగా నాణ్యత వివరాలు ఆలయానికి అందుతాయి. అప్పుడు ఏ ఈఓ కొన్న వెండిలో నాణ్యత తక్కువ ఉందో తేలిపోతుందని చెబుతున్నారు.
 
అయితే నాగపడగలను కరిగించి, తేల్చిన నాణ్యత ఆధారంగా ఈఓలపై చర్యలు తీసుకోవడానికి వీలుండకపోవచ్చని కొందరు వాదిస్తున్నారు. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించాలనుకునేవారు ఇక్కడ నాగపడగలు ఇస్తారనే విషయం తెలియక బయట నుంచి తెచ్చుకునేవారని, తీరా ఇక్కడికి వచ్చాక ఆలయం ఇచ్చే పడగలతో పాటు వాటిని హుండీలో వేస్తారని వివరిస్తున్నారు. దీనివల్ల హుండీలో పోగయినవన్నీ ఆలయం కొనుగోలు చేసిన వెండితోనే తయారుచేసినవిగా చెప్పడానికి వీలుపడదని అంటున్నారు. ఇందులో వాస్తవం కూడా ఉంది. ఒకప్పుడు నాగపడగలను ప్రైవేటు వ్యక్తులతో తయారుచేయించేవారు. వారి వద్ద నాగపడగల అచ్చులు ఉన్నాయి. ఇప్పటికీ అలాంటి వారు నాగపడగలు తయారుచేసి భక్తులకు అంటగడుతున్నారని ఆలయ ఉద్యోగులే చెబుతున్నారు.
 
ఒకప్పుడు వెండి కొనుగోలు చేయడం, పడగలు తయారుచేయడం, భక్తులకు ఇవ్వడం, పూజ అనంతరం భక్తులు వాటిని హుండీలో వేయడం, హుండీ నుంచి స్ట్రాంగ్‌ రూంకు తరలించడం ఇదీ పద్ధతి. అందుకే 15 టన్నుల పడగలు పోగుపడ్డాయి. అయితే కొంతకాలంగా రెండు టన్నుల వెండినే రీ-సైకిల్‌ చేస్తున్నారు. హుండీలో పడిన తరువాత వాటిని ఆలయంలోనే కరిగించి మళ్ళీ పడగలు తయారుచేస్తున్నారు. ఇందుకోసం 99.99 టచ్‌ నాణ్యత కలిగిన వెండిని కొనుగోలు చేశారు. కొంతకాలంగా రీ-సైకిల్‌లో ఉన్న ఈ వెండి నాణ్యతను ఇప్పుడు తనిఖీ చేస్తే 99.99 టచ్‌ ఉండకపోవచ్చునని చెబుతున్నారు. దీనికి కారణం బయటి నుంచి వచ్చి కలుస్తున్న నాగపడకలేనని వివరిస్తున్నారు. అందుకే మింట్‌లో కరిగిస్తున్న నాగపడగల నాణ్యత ఆధారంగా అధికారులపై చర్యలు తీసుకోవడానికి వీలుకాకపోవచ్చని అంటున్న వారు ఉన్నారు. 
 
ఏ వస్తువైనా కొనుగోలు చేసేటప్పుడు నాణ్యత పరీక్షించాలి. యేండ్లు గడిచిపోయిన తరువాత ఆ పని చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఈ 15యేళ్ళలో పనిచేసిన కార్యనిర్వహణాధికారుల్లో చాలా మంది ఉద్యోగ విరమణ చేశారు. ఒకరిద్దరు భౌతికంగా లేరు కూడా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎవరిపైనా చర్యలకు ఉపక్రమించకపోవచ్చని తెలుస్తోంది. 
 
అత్యవసరంగా వెండి కరిగించడం వెనుక అసలు ఉద్దేశం అక్రమాల నిగ్గుతేల్చడం కాదు. ఆలయాల్లో పౌరుల వద్ద నిరుపయోగంగా బంగారాన్ని పోగుచేయడం కోసం కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్‌ స్కీం ప్రవేశపెట్టింది. దీంతో బంగారం దిగుమతులు తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే ఇటీవల తితిదేతో పాటు శ్రీకాళహస్తి ఆలయం కూడా బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేశాయి. ఆలయాలు, వ్యక్తులు తమ వద్ద వున్న వెండి ఇస్తే అందుకు సమానమైన బంగారాన్ని ప్రధాని గోల్డ్ మానిటైజేషన్‌ స్కీములో పెట్టకుంటారు. ఇటీవల తితిదే కూడా తన వద్ద వెండిని ఇలాగే బంగారంగా మార్చి డిపాజిట్‌ చేయడానికి శ్రీకారం చుట్టింది. వెండి నాగపడగల కరిగింపుపై దేవదాయ శాఖ ప్రత్యేక శ్రద్థ పెడుతున్నదీ అందుకోసమేనంటున్నారు.