ఎండాకాలంలో ఊరెళ్తున్నారా? ఇలా చేయకపోతే గోవిందా..గోవిందా..

మోహన్| Last Updated: మంగళవారం, 19 మార్చి 2019 (18:34 IST)
పరీక్షలు పూర్తికాగానే ప్రజలు విహారయాత్రలు, సొంత ఊర్లకు వెళ్తుంటారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ఇంటి పరిసరాలకు రక్షణ కంచెలను ఏర్పాటు చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
ఎండలు మండిపోతుండడం వల్ల రాత్రి సమయాల్లో ఇంటికి తాళం వేయకుండా, కేవలం గడియ పెట్టి బంగ్లాపై పడుకుంటారు. మరికొంత మంది మెయిన్ డోర్ పక్కన ఉండే కిటికీలను తెరిచి పడుకుంటారు. ఇటువంటి చిన్న చిన్న నిర్లక్ష్యాల కారణంగా దొంగలకు అవకాశం కల్పించినట్లవుతుంది. ఈ క్రమంలోనే వస్తువులు చోరీకి గురికాకుండా ఉండేందుకు ప్రజలను చైతన్యవంతులుగా చేస్తున్నారు. దీని కోసం సైబరాబాద్ సైబర్ క్రైమ్, స్థానిక పోలీసులు అవగాహనతో పాటు నేరస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
 
ఎండాకాలంలో దొంగతనాలు ఎక్కువగా మధ్యాహ్నం, అర్ధరాత్రి సమయాల్లోనే జరుగుతుంటాయి. అందులో అమావాస్య చీకటి దొంగలకు మరింత కలిసి వస్తుంది. ఎందుకంటే అమావాస్య చీకటి రోజున మొత్తం చీకటి ఉండడం వారికి మంచి అవకాశంగా మారుతుందని పట్టుబడిన పలువురు దొంగలు వెల్లడించారు. ఈ కాలంలో దొంగలు మధ్యాహ్న సమయంలో రెక్కీ వేసి, రాత్రి సమయాల్లో తెగబడతారట. 
 
ఇందుకోసం సరైన భద్రత ప్రమాణాలను పాటించని ఇళ్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే ఇళ్లను ఎంపిక చేసుకుంటారు. ఈ కాలంలో ఇంటి బయట పార్క్ చేసిన వాహనాలను కూడా దొంగలు ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఈ చోరీలను అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
ప్రజలు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు....
 
* ఇంటికి తాళాలు వేసుకుని ఊళ్లకు, విహారయాత్రలకు వెళ్లేవారు ఫోన్ నంబర్, ఇంటి చిరునామాను స్థానిక పోలీసులకు తెలియజేయాలి.
* ఇంటికి తాళం వేసి, దానిని బయటపెట్టకండి
* కిటికీలను పూర్తిగా మూసివేయాలి
 
* ఇంటి పక్కవారికి లేదా నమ్మకమైన వారికి తాళం వేసి ఉన్న ఇంటిని గమనిస్తుండమని చెప్పండి.
* బంగారు ఆభరణాలు వేసుకుని ఆరుబయట పడుకోవద్దు.
* తాళం బయటికి కనపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
 
* ఇంట్లోని నగదు, విలువైన వస్తువులు, వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల గురించి బహిరంగంగా చెప్పకండి.
* మధ్యాహ్న సమయాల్లో ఎవరైనా కాలనీల్లో తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారమివ్వండి.
* ఇంటికి తాళం వేసి వెళ్లినప్పుడు టైమర్‌తో కూడిన లైట్లను ఏర్పాటు చేసుకోవాలి.
 
* ఇంట్లో ఒంటరిగా ఉండే వారు అనుమానాస్పద వ్యక్తులను లోపలికి అనుమతించవద్దు.
* ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అమర్చుకోవాలి.
* తాళం వేసి వెళ్తున్నప్పుడు అలారమ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
 
* మహిళలు ఆభరణాలు ధరించి బయటికి వెళ్తున్న సమయంలో కొంగును నిండుగా కప్పుకోవాలి.
* విలువైన వస్తువులను లాకర్లలో పెట్టుకోవాలి.
 
* రైల్వేట్రాక్ పక్కన ఉండేవారు అప్రమత్తంగా ఉండాలి.
* చిన్నారుల మెడలో ఎక్కువగా బంగారం ఉంచకండి.
* ఇళ్లు అద్దెకు ఇచ్చే సమయంలో పూర్తి వివరాలు, ఆధార్ లేదా ఇతర ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి.
* కాలనీ అసోసియేషన్‌లు కమిటీలను ఏర్పాటు చేసుకుని సీసీ కెమెరాలు, వాచ్‌మెన్‌లను పెట్టుకోవాలి.
* ప్రతి ఒక్కరూ స్థానిక పోలీస్ స్టేషన్ నెంబర్, బీట్ కానిస్టేబుల్ నంబర్‌ను దగ్గర పెట్టుకోవాలి.
 
* వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఇంట్లో ఒంటరిగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* కుక్కలను పెంచుకోవడం మంచిది.
* వివాహాది శుభకార్యాల్లో దృష్టి మళ్లించి బంగారం ఆభరణాలను ఎత్తుకెళ్ళే దొంగలు తిరుగుతుంటారు. అందుకే అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండమని మీ పిల్లలకు చెప్పాలి.దీనిపై మరింత చదవండి :