మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (11:59 IST)

అసలే వేసవి కాలం.. ఇంట్లో చిన్నపిల్లలున్నారా? జాగ్రత్త సుమా..

వేసవిలో పిల్లలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఉష్ణోగ్రత అధికంగా ఉండటంలో తరచూ అనారోగ్యం పాలవుతుంటారు. వేడి వాతావరణంలో తిరగడం వలన శరీర ఉష్ణోగ్రత పెరిగి వేడి చేస్తుంది, శరీరం నుండి చమట రూపంలో నీరు బయటకు వెళ్లిపోవడం వల్ల ఎనర్జీ తగ్గిపోతుంది. వడదెబ్బకు దారి తీస్తుంది.


ఇంట్లో ఉండే చిన్న పిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చర్మంపై పేరుకుపోయిన మలినాల వలన చెమటకాయలు, ఇన్ఫెక్షన్ కలిగి సెగగడ్డలు లేస్తాయి. వాటిని నిర్లక్యం చేస్తే జ్వరం వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి స్నానం చేయడంతో సరిపెట్టుకోకుండా తరచూ ముఖం, కాళ్లు, చేతులను చన్నీటితో కడుగుతూ ఉండాలి. 
 
వేసవి కాలంలో వచ్చే వ్యాధులు ఇతరుల నుండి వేగంగా సంక్రమిస్తాయి. కళ్ళకలక, గవద బిళ్ళలు, టైఫాయిడ్, పొంగు, అతిసార, కామెర్లు వంటిని సాధారణంగా వేసవిలో వచ్చే వ్యాధులు. ఉదయం సాయంత్రం ఎండలేని సమయాలలో పిల్లలు బయటకు వెళ్లడానికి అనుమతించాలి. ఎండ సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకు బోర్ కొట్టకుండా కథలు చెప్పడం, రైమ్స్, పాటలు పాడించడం, డ్రాయింగ్స్ వేయించడం, పుస్తకాలు చదివించడం, ఇండోర్ గేమ్స్ ఆడించడం వంటి వాటితో కాలక్షేపం చేయాలి. 
 
ఇంట్లోకి నేరుగా వేడిగాలి చొచ్చుకురాకుండా ద్వారాల వద్ద మ్యాట్‌లు వేలాడదీయాలి. ఇలా చేస్తే గదిలో చల్లటి వాతావరణం నెలకొంటుంది. పిల్లలకు వేడి నీటితో స్నానం చేయించాలి. ఒకవేళ వేడి చేసినట్లయితే తడిబట్టతో తుడుస్తూ సాధారణ స్థితికి తీసుకురావాలి. శరీరానికి గాలి ప్రసరించేట్టుగా పలుచటి కాటన్ దుస్తులు వేయాలి. బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ తగలకుండా గొడుగు టోపీ వేయాలి. 
 
పిల్లలు ఆటల్లో పడి నీరు సరిగ్గా తాగరు. దాహంతో పనిలేకుండా పిల్లలకు తరచూ నీళ్లు తాగిస్తుండాలి. కొబ్బరినీళ్ళు, బార్లీ, సబ్జా, సగ్గుబియ్యం ద్రవాలు తాగిస్తుండాలి. సీజనల్ ఫ్రూట్స్, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు తినిపించాలి. నిల్వ ఉంచిన ఆహారం జోలికి పోకుండా తాజా ఆహారాన్ని తినిపించడం చాలా మంచిది. సరైన సమయానికి టీకాలు వేయించి వ్యాధులను నిరోధించాలి.